Anakapalli: మండలానికి ఒక వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలి: కలెక్టర్

Anakapalli: ప్రతి మండలానికి ఒక వాటర్ ట్యాంక్ లేదా చెరువును గుర్తించి శుభ్రపరచాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలను ఆదేశించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 19 Sept 2026 6:14 PM IST
Anakapalli
X

Anakapalli: మండలానికి ఒక వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లా: ప్రతినెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం మునగపాక మండలం మునగపాక గ్రామంలోని చీర్ల అప్పన్న చెరువును ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువు శుభ్రపరిచే పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పాడైపోయిన చెరువులను పునరుద్ధరించి పరిశుభ్రంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చెరువుల అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

సుమారు రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన చీర్ల అప్పన్న చెరువును జీవనోపాధి, పారిశుధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది సుమారు 50 మంది కలిసి ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో శుభ్రపరిచే పనులు చేపట్టడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం ఒక వాటర్ ట్యాంక్ లేదా చెరువును గుర్తించి శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉషారాణి, మండల ప్రత్యేక అధికారి ప్రభాకర్, డిప్యూటీ ఎంపీడీవోలు సోమరాజు, హేమసుందర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM