Anakapalli: చోడవరం మండలంలో ఇష్టారాజ్యంగా భూముల రీసర్వే!
Anakapalli: చోడవరం మండలం జన్నవరంలో భూముల రీసర్వే అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం. నోషనల్ ఖాతాలో వెయ్యి ఎల్పీ నంబర్లు, కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
Anakapalli: చోడవరం మండలంలో ఇష్టారాజ్యంగా భూముల రీసర్వే!
Anakapalli: భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ శాఖ సర్వే సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు తరచూ చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో సమస్యలు మరింత జటిలమై రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇందుకు చోడవరం మండలం జన్నవరంలో చేపట్టిన భూముల సమగ్ర రీసర్వేను ఒక ఉదారణకు చెప్పవచ్చు.
జన్నవరం గ్రామంలో గత ఏడాది అక్టోబరులో భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 3,811 ఎల్పీ నంబర్లు ఉండగా, ఇందులో వెయ్యి ఎల్పీ నంబర్లు ఎవరివో తేల్చకుండా వాటన్నింటినీ నోషనల్ ఖాతాలో చేర్చి రీసర్వే పూర్తయిందని చేతులు దులుపేసుకున్నారు. రీసర్వే ద్వారా భూముల వివరాలు తేల్చకపోగా, ఇప్పటికే పక్కా రికార్డులు వున్న రైతుల పేర్లను తొలగించి, భూ యజమానులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. రీసర్వేను మొక్కుబడిగా సాగించడమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం కాకుండా గ్రామంలో ఒకరిద్దరు దళారుల సహకారంతో అడ్డగోలుగా సర్వే నిర్వహించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సర్వే అధికారులను వ్యక్తిగతంగా కలిసి, ముడుపులు ఇచ్చిన వారి వివరాలు మాత్రమే రికార్డుల్లో నమోదు చేసి, కలవని వారిని విడిచిపెట్టేశారని రైతులు పేర్కొన్నారు.
రీసర్వేకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, వారికి నచ్చినప్పుడు వచ్చి స్వర్ణ గ్రామ కార్యాలయంలో కూర్చుని సర్వే చేసినట్టు చెప్పేసి వెళ్లిపోయేవారని ఆరోపిస్తున్నారు. భూముల వివరాల గురించి అడిగితే సర్వే అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులు. వీరిలో ఎకరా మించి భూములు లేవు. రీసర్వేలు ఆయా భూముల విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకంలో వున్న భూముల వివరాలకు, రీసర్వే సమయంలో అధికారులు వెల్లడిస్తున్న భూముల వివరాలకు పొంతన లేదని వాపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
సర్వే అధికారుల అలసత్వం కారణంగా వెయ్యి ఎల్పీ నంబర్లు మిగిలిపోవడంతో, ఆయా రైతులు ఈ భూములు తమవేనని నిరూపించుకోవడానికి, వాటిని ఖాతాలో నమోదు చేయించుకోవడానికి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన వస్తుందని వాపోతున్నారు. అయినప్పటికీ నోషనల్ ఖాతాలో పెట్టిన భూములు తమకు దక్కుతాయా? లేక 22ఏ జాబితాలోకి చేరుస్తారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
రీసర్వేలో అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి పొలం పనులు మానుకొని రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నాళ్లు తిరగాలని ప్రశ్నిస్తున్నారు. సర్వే సిబ్బంది నిర్వాకంపై సోమవారం అనకాపల్లి వెళ్లి పీజీఆర్ఎస్ కలెక్టరు పిర్యాదు చేశారు.




