Narsipatnam: నర్సీపట్నంలో ముమ్మరంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతి ప్రచారం!

Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం. అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికీ పర్యటన.

R. A. Naidu, Narsipatnam
Published on: 24 Oct 2026 2:54 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నంలో ముమ్మరంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతి ప్రచారం!

​నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వార్డుల్లో నాయకులు, కార్యకర్తల విస్తృత పర్యటనలతో ఎన్నికల సందడి నెలకొంది. ఇందులో భాగంగా శుక్రవారం 39, 40వ వార్డుల పరిధిలోని గచ్చపు వీధి, అయ్యన్న కాలనీల్లో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి నాయకుల తో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతికి వార్డు మహిళలు హారతులు పట్టి, పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఆమె ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. చెప్పామంటే చేస్తాం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం అని ప్రజలకు బలంగా హామీ ఇచ్చారు.

​ఈ ప్రచారంలో నాయకులు డబ్బీరు శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డుల్లో మంజూరైన పనుల టెండర్లను సైతం రద్దు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందన్నారు. అనంతరం చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబ్బులిస్తే కానీ పనులు జరగని దౌర్భాగ్య స్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే కేవలం 28 రోజుల్లోనే గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడి చొరవతో రూ.4.11 కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చారని తెలిపారు.

​నర్సీపట్నంలో ఒకప్పుడు చెత్త కూడా ఎత్తలేని దుస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని ఇప్పుడు సమూలంగా మార్చేశామని పద్మావతి అన్నారు. స్పీకర్ చొరవతో రూ.2 కోట్లు వెచ్చించి 3 టన్నుల చెత్తను జిందాల్ కంపెనీకి తరలించేలా ఏర్పాటు చేశామన్నారు. మరో రూ.3 కోట్లతో చెత్త శుద్ధి, వర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 వార్డుల అభివృద్ధికి రూ.267.70 కోట్లు తీసుకొచ్చామని, పార్టీలకతీతంగా పనులు చేపట్టామని స్పష్టం చేశారు. 39, 40 వార్డులకే రూ.6.63 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

​గత కౌన్సిల్ హయాంలో ఆసుపత్రి వెనుక కాలువ నిర్మాణానికి మూడేళ్లపాటు పోరాడినా నిధులు ఇవ్వలేదని, కూటమి రాగానే రూ.26 లక్షలతో ఆ పని పూర్తి చేశామన్నారు. ఉత్తరవాహిని సత్యనారాయణ స్వామి గుడి వద్ద కల్యాణ మండపానికి రూ.75 లక్షలు కేటాయిస్తే ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. అదే తమ వార్డులో కల్యాణ మండపం కావాలని ఎంపీ విజయ్‌ని కోరగానే ఎంపీ నిధుల నుండి రూ.40 లక్షలు, అలాగే అంగన్‌వాడీ భవనం కూడా మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. రూ.185 కోట్లతో ఇంటింటికీ కుళాయి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోగా ప్రతి ఇంటికీ తాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు.

​నన్ను రక్షించండి అనేవారికి ఓటు వేయడం అవసరమా, మనల్ని రక్షించేవారికి, మన కష్టాలు తీర్చే నాయకులకే ఓటు వేయాలి అని పద్మావతి పిలుపునిచ్చారు. మీరంతా నా కుటుంబ సభ్యులని, సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయ్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి వార్డులోనూ ఒక కమిటీ వేసి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, సీనియర్ నాయకులు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam