Alluri: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన!

Alluri: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఐఏఎస్ రోణంకి కుర్మనాథ్. పాడేరులో పీవో, ఏపీవోలకు తొలి విడత శిక్షణ.

SAI, PADERU
Published on: 26 Oct 2026 7:29 PM IST
Alluri
X

Alluri: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన!

అల్లూరి: అల్లూరి సీతారామరాజు జిల్లా రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీ రోణంకి కుర్మనాథ్, ఐఏఎస్ సోమవారం పరిశీలించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు.

పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పరిశీలకులు

పాడేరులోని విఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవోలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు (ఏపీవోలు) నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

పెదబయలులో కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

అనంతరం పెదబయలు మండలంలోని విద్యా నికేతన్ బాలుర వసతి గృహంలో కొత్తగా ప్రతిపాదించిన కౌంటింగ్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. కేంద్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, అవసరమైన మౌలిక సదుపాయాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీ శ్యామ్ సుందర్, రెవెన్యూ అధికారి శ్రీ లక్ష్మణరావులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

జి.మాడుగుల మండలంలో పోలింగ్ కేంద్రాల తనిఖీ

జి.మాడుగుల మండలం వంజరి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నంబర్ 23ను, రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. అలాగే స్వర్ణ గ్రామం-1లోని పోలింగ్ కేంద్రం , పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం తనిఖీ చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల మార్పుపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలి

వంజరి గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రతిపాదనలను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల మార్పు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.

వంజరి గ్రామ పంచాయతీ పరిధిలోని 45 గ్రామాల ప్రజలకు పోలింగ్ కేంద్రాల మార్పు వివరాలను దండోరా ద్వారా విస్తృతంగా తెలియజేయాలని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీ రాజకుమార్‌ను ఆదేశించారు.

ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాల వివరాలను ముందుగానే తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చూడాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించి, పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు సూచించారు.

SAI, PADERU

SAI, PADERU