Alluri: అల్లూరి జిల్లాలో కలెక్టర్ నిషాంతి ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ!

Alluri: అల్లూరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ నిషాంతి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రవర్తనా నియమావళిని వివరించారు.

SAI, PADERU
Published on: 16 Oct 2026 7:46 PM IST
Alluri
X

Alluri: అల్లూరి జిల్లాలో కలెక్టర్ నిషాంతి ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ!

అల్లూరి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి శుక్రవారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల సన్నద్ధత, నిర్వహణ ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై కలెక్టర్ వివరించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణీత తేదీలు, వివిధ దశల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తూ, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలను కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సంబంధిత నిబంధనలను పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళికి సంబంధించిన ప్రతులను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు పంపిణీ చేశారు.

ఐఏఎస్ అధికారుల సమక్షంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతితో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ, పాడేరు సబ్ కలెక్టర్ కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్, అదనపు ఎస్పీ శ్రీమతి శ్రుతి పాల్గొన్నారు.

అనంతరం జెడ్పీ సీఈఓ వాసుదేవరావు, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీఓ కుమార్ తదితర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలు, సంబంధిత శాఖల సమన్వయం తదితర అంశాలపై సమీక్షించారు.

SAI, PADERU

SAI, PADERU