Narsipatnam: నర్సీపట్నంలో జర్నలిస్టుల నిరసన, వినతిపత్రం అందజేత!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన. సీఐకి వినతిపత్రం అందజేత.
Narsipatnam: నర్సీపట్నంలో జర్నలిస్టుల నిరసన, వినతిపత్రం అందజేత!
Narsipatnam: ఐజేయూ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్. స్వామి మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులు, మీడియా సంస్థల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని, మీడియా ఉద్యోగుల కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల కిషోర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ ప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉండే త్రైపాక్షిక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి హెల్త్ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ పథకాన్ని పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి బాబ్జి మాట్లాడుతూ జర్నలిస్టులకు రైల్వే ప్రయాణంలో 50 శాతం రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామి, ఏపీ ఈఎంజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల కిషోర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి బాబ్జి, జిల్లా కార్యవర్గ సభ్యులు రామ గణేశ్వరరావు, ఈ. అప్పారావు, ఏపీ ఈఎంజేఏ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుపులేటి ప్రభాకర్, శ్రీనివాస్ వర్మ, నర్సీపట్నం ఏరియా కమిటీ అధ్యక్షుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కార్యదర్శి రెడ్డి నాయుడు, కోశాధికారి ఈశ్వరరావు, 123 tv వరహలుబాబుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.




