Amaravati: అక్వాన్ తీవ్ర తుపానుపై హోంమంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష!
Amaravati: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించి, 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Amaravati: అక్వాన్ తీవ్ర తుపానుపై హోంమంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష!
అమరావతి: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కదలికలు, తీరం దాటే సమయం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అక్వాన్ తుపాను ప్రస్తుతం మందగమనంతో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని అధికారులు వివరించారు. ఎల్లుండి మధ్యాహ్నానికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
రానున్న 48 గంటలపాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి కోరారు. అధికారిక హెచ్చరికలను మాత్రమే నమ్మాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను విశ్వసించవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు.
అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
పోలీస్ అత్యవసర సేవలు: 112
రాష్ట్ర విపత్తుల నిర్వహణ: 1070
టోల్ ఫ్రీ నంబర్: 18004250101
మన మిత్ర వాట్సాప్: 9552300009
విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, నీటి నిల్వలు తదితర సమస్యలను మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు వెంటనే తెలియజేయాలని సూచించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేయాలని ఆదేశించారు.
కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు ప్రజలు వెళ్లవద్దని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర సమస్య తలెత్తితే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు.




