Visakhapatnam: ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ ఎర్రంశెట్టి నరేష్ హఠాన్మరణం!

Visakhapatnam: విశాఖకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ ఎర్రంశెట్టి నరేష్ (హిట్లర్) మృతి పట్ల ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ సంతాపం తెలిపారు.

SHIVA, BHIMILI
Published on: 27 Sept 2026 5:47 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ ఎర్రంశెట్టి నరేష్ హఠాన్మరణం!

Visakhapatnam: ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి విశేష సేవలందించిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ ఎర్రంశెట్టి నరేష్ (హిట్లర్) అకాల మరణం క్రీడా రంగానికి, ఆయన శిష్యులకు, మిత్రులకు తీరని లోటుగా మారింది. ఆయన మృతికి పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, విద్యావేత్తలు, అభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

హిట్లర్ చినవాల్తేర్ ప్రాంతానికి చెందినవారు. ఆయన MA, B.P.Ed, M.P.Ed, NIS విద్యార్హతలతో పాటు AIFF Grassroots Football Coachగా, D-License మరియు C-License కోచ్‌గా ఫుట్‌బాల్ రంగంలో సేవలందించారు. తనతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మిత్రులతో ఏర్పాటు చేసిన Blue Star FCకు AIFFలో మంచి గుర్తింపు తీసుకువచ్చి, అనేక టోర్నమెంట్లలో జట్టు విజయాలు సాధించేందుకు కృషి చేశారు.

ఫుట్‌బాల్ కోచింగ్‌ను తన జీవనోపాధిగా ఎంచుకున్న హిట్లర్ విశాఖపట్నంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. VDFA అసోసియేషన్‌కు కోచ్‌గా ఎనలేని సేవలందించడంతో పాటు పలువురు క్రీడాకారులను సంతోష్ ట్రోఫీ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. హిట్లర్ కేవలం ఫుట్‌బాల్ కోచ్ మాత్రమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం అండగా నిలిచిన సేవాభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం ఆర్థిక సహాయం అందించారు. తన వద్ద ఫుట్‌బాల్ కోచింగ్ తీసుకున్న పలువురిని వివిధ కళాశాలల్లో చేర్పించి, ఫీజులు చెల్లించడంలో సహకరించి, చదువుకోవాలని ప్రోత్సహించారు. తన వీధిలో ఫుట్‌బాల్ ఆడుతున్న ఆర్థికంగా వెనుకబడిన యువతకు Open School, ఇంటర్మీడియట్, B.P.Ed, కోచ్‌ ట్రైనింగ్ తదితర కోర్సులు చేయిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేశారు.

ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు నేడు శ్రీనిధి ఫుట్‌బాల్ ట్రస్ట్ తరఫున ఆడుతున్నారని సన్నిహితులు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మర్ ఫుట్‌బాల్ కోచింగ్‌కు సుమారు 250 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యేవారు. AIFF ద్వారా సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తూ ఫుట్‌బాల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమని పలువురు పేర్కొన్నారు. AIFFలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

కరోనా మహమ్మారి సమయంలో తన వద్ద కోచ్‌లుగా పనిచేసిన వారికి అండగా నిలిచిన హిట్లర్, తన సొంత నిధులతో నిత్యావసర సరుకులు అందించి వారికి సహాయం చేశారు. ప్రస్తుతం గీతం కళాశాలలో కోచ్‌గా సేవలందిస్తూ ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. హిట్లర్ అకాల మరణ వార్త తెలుసుకున్న పలువురు ఆంధ్ర ప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ మెంబెర్స్ అందరు పాల్గున్నారు.

అలాగే ఆంధ్రా యూనివర్సిటీకు చెందిన వారు, క్రీడాకారులు, కోచ్‌లు, ఆయన శిష్యులు మరియు మిత్రులు ఆయనకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫుట్‌బాల్ క్రీడను తన జీవితంగా భావించి, ఎంతోమంది క్రీడాకారుల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలిచిన ఎర్రంశెట్టి నరేష్ (హిట్లర్) ఇక లేరనే వార్త క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. ఆయన చేసిన సేవలు, తన శిష్యుల పట్ల చూపిన ప్రేమాభిమానాలు, విద్య మరియు క్రీడలకు అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు పేర్కొన్నారు. RIP మిత్రమా… నీ జ్ఞాపకాలు, నీ సేవలు, నీ శిష్యుల విజయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI