Anakapalli: అనకాపల్లిలో పారిశుధ్యంపై జోనల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి!

Anakapalli: అనకాపల్లి 108, 109 వార్డుల్లో జోనల్ కమిషనర్ కే. చక్రవర్తి బుధవారం పర్యటించి నాలుగు రకాల చెత్త విభజన, డెంగ్యూ నివారణపై ఆదేశాలు జారీ చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 18 Nov 2026 7:04 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో పారిశుధ్యంపై జోనల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి!

అనకాపల్లి: పరిసరాల పరిశుభ్రత కేవలం అధికారుల బాధ్యతే కాదు.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. పారిశుధ్యాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని అనకాపల్లి జోనల్ కమిషనర్ కే. చక్రవర్తి అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేశారు.

జీవీఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గవరపాలెంలోని 108, 109 వార్డుల మస్టర్ పాయింట్‌లో నిర్వహించిన వార్డు బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ప్రజారోగ్య పరిరక్షణపై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

కొత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటి నుంచి సేకరించే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్‌గా నాలుగు రకాలుగా వేరు చేసి అందించాలని ప్రజలకు సూచించారు. ఇంటింటి చెత్త సేకరణను పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు (జీవీపీలు) ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

*స్వచ్ఛ సర్వేక్షణ్‌-2026లో జీవీఎంసీకి దేశస్థాయిలో మొదటి స్థానం లభించడంలో పబ్లిక్ హెల్త్ సిబ్బంది కృషి అభినందనీయమని* కే. చక్రవర్తి ప్రశంసించారు. సాధించిన స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని, అదే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మరోవైపు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. మలేరియా సిబ్బంది యాంటీ లార్వల్ ఆపరేషన్లను నిరంతరం నిర్వహించాలని, దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనకాపల్లి పరిధిలో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు కాకుండా ముందస్తు నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

ప్రజలు సైతం తమ బాధ్యతగా కాలువల్లో చెత్త వేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జోనల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆడారి సంతోష్ కుమార్, స్వచ్ఛ భారత్ ఇన్‌చార్జి దాడి భాస్కరరావు, వార్డు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శులు మోహన్, భవాని, రాజు, సందీప్, శ్రీనివాస్, వెంకటేష్, సింహాచలం, సూపర్‌వైజర్లు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, జీవీఎంసీ అధికారులు, కార్యాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI