Anakapalli: పిసిపిఎన్‌డిటి చట్టం కఠిన అమలుకు ఆదేశాలు

Anakapalli: అనకాపల్లిలో పిసిపిఎన్‌డిటి చట్టం కఠిన అమలుకు అధికారుల ఆదేశం. గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 26 Sept 2026 8:49 PM IST
Anakapalli
X

Anakapalli: పిసిపిఎన్‌డిటి చట్టం కఠిన అమలుకు ఆదేశాలు

అనకాపల్లి: గర్భస్థ శిశు లింగ నిర్ధారణను అరికట్టేందుకు PCPNDT చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని అనకాపల్లి ఇంచార్జ్ ఆర్డీఓ వై. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో PCPNDT చట్టం అమలుపై సబ్-డివిజన్ స్థాయి సలహా కమిటీ, అప్ప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సంయుక్త సమావేశం శనివారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్, స్కానింగ్ కేంద్రాలు PCPNDT చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలు, రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్, ఫారం-F తదితర అంశాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమే కాకుండా తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు జరగకుండా సంబంధిత అధికారులు స్కానింగ్ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. కేంద్రాలను తరచూ తనిఖీ చేసి, చట్ట నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా పరిశీలించాలని సూచించారు.

అలాగే PCPNDT చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించి, చట్ట ఉద్దేశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వెంకటేష్, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, డెమో సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI