Anakapalli: అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు!

Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 18 Oct 2026 3:34 PM IST
Anakapalli
X

Anakapalli: అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు!

అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు అనకాపల్లి డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు వెల్లడించారు. అక్టోబర్ 14, 2026 నుంచి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.

సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

అనకాపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున, పోలీసుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తీసుకున్న తర్వాతే బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని డీఎస్పీ స్పష్టం చేశారు. మైక్ సెట్లు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి కూడా నిబంధనల ప్రకారం అనుమతి పొందాలని సూచించారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, గోడలపై రాతలు రాయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువులు పంపిణీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ నగదు, మద్యం రవాణా, నిల్వలపై ఫ్లయింగ్ స్క్వాడ్‌లు (FST), స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (SST) నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని వెల్లడించారు.

సోషల్ మీడియా పోస్టులపైనా నిఘా

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేసినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలి

ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI