Anakapalli: అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

Anakapalli: అనకాపల్లిలో సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు; ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి 4.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 6 Oct 2026 7:23 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు కేసులకు సంబంధించి సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎ. వెంకటేశ్వరరావు, క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో మహేందర్ సింగ్ అలియాస్ మహేంద్ర, 40 సంవత్సరాలు, రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని ప్రధాన నిందితుడిగా, మండ్రు లత రత్నాకర్, 52 సంవత్సరాలను మరో నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. మహేందర్ సింగ్ ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడలో నివాసం ఉంటూ రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

36కు పైగా నేరాల చరిత్ర

ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్ గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నేరాలకు పాల్పడి 2013 నుంచి 2015 మధ్య జీడిమెట్ల, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని సుమారు 36 బంగారు గొలుసుల స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు.

ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అనంతరం విశాఖపట్నం మధురవాడకు మకాం మార్చిన మహేందర్ సింగ్.. రాపిడో బైక్ నడుపుతూనే విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితుడు లత రత్నాకర్‌కు అప్పగించేవాడని, ఆమె తనకు పరిచయం ఉన్న నగల దుకాణాల్లో వాటిని విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకునేవారని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

అనకాపల్లిలో రెండు చైన్ స్నాచింగ్‌లు

ఈ ఏడాది మే 22న అనకాపల్లి బొడ్డేడువారి వీధిలో విశ్వనాథ నాగరత్నం అనే మహిళ వద్ద నుంచి సుమారు 1.5 తులాల బంగారు గొలుసును నిందితుడు అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

అదే రోజు గాంధీనగర్‌లో పల్లా సత్యవతి అనే వృద్ధురాలి మెడలోని మూడు పేటల బంగారు గొలుసును హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన నిందితుడు లాక్కెళ్లినట్లు వెల్లడించారు.

ఈ రెండు కేసులపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ పోలీసులు, అనకాపల్లి టౌన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు.

ఈ విచారణలో నిందితురాలు మండ్రు లత రత్నాకర్ నుంచి రెండు కేసులకు సంబంధించిన సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

కేసును చాకచక్యంగా ఛేదించి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్, ఎస్ఐ ఎ. వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ జి. గాంధీ, కానిస్టేబుళ్లు ఎం. సముద్రం, ఆర్.పి. నాయుడు, టి.ఎస్. నాయుడులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే నేరస్థులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI