Anakapalli: భారీ వర్షాల హెచ్చరిక: అనకాపల్లిలో కంట్రోల్ రూమ్‌లు
Anakapalli: బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 24×7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
Anakapalli: భారీ వర్షాల హెచ్చరిక: అనకాపల్లిలో కంట్రోల్ రూమ్‌లు
అనకాపల్లి: భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మండల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులు, సచివాలయ, వార్డు స్థాయి సిబ్బంది తమ పరిధిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగా అత్యవసర సరుకులు, ఆయిల్, గ్యాస్ నిల్వలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల సమయంలో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా మున్సిపల్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖలోని SDRF, NDRF బృందాలను సన్నద్ధం చేశారు. జిల్లా, డివిజన్ స్థాయిలో 24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సహాయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా సెల్‌ఫోన్ టవర్ల వద్ద జనరేటర్లను సిద్ధంగా ఉంచారు.
ఇరిగేషన్ ట్యాంకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అలాగే మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ శాఖ అధికారులను ఆదేశించారు.
అత్యవసర ఫోన్ నంబర్లు
జిల్లా కలెక్టర్ కార్యాలయం, అనకాపల్లి:
8924222888, 8924226599, 8924225999
రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, అనకాపల్లి:
9014578858
రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, నర్సీపట్నం:
0893-2224420
జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు చేపట్టినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.




