Anakapalli: నర్సీపట్నం అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: ఎంపీ విజయ్!
Anakapalli: నర్సీపట్నం సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటర్ ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్లు తీసుకొచ్చామని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ వెల్లడించారు.
Anakapalli: నర్సీపట్నం అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: ఎంపీ విజయ్!
నర్సీపట్నం: నర్సీపట్నంలో కూటమి నాయకులతో కలిసి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు గాదె శ్రీనివాసరావు, జనసేన నాయకులు అల్లాడ సురేష్, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను పత్రికా ముఖంగా వివరించారు.
రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లా ముందుకు వెళ్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. నర్సీపట్నం చరిత్రలో తొలిసారిగా వాటర్ ప్రాజెక్ట్ (జల జీవన్ మిషన్) కోసం రూ. 500 కోట్లు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన ఉద్ఘాటించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పారిపోయారని, కనీసం ఆసుపత్రులు కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయారని విమర్శించారు. 2018లో మంజూరైన వాటర్ ప్రాజెక్టును తామే తెచ్చామని ప్రతిపక్ష నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఆధారాలతో సహా వారి వాదనలను ఆయన తిప్పికొట్టారు. ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని, దెబ్బతిన్న రోడ్ల నిర్మాణంతో పాటు పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో నర్సీపట్నం ప్రజలు కూటమికి చారిత్రాత్మక మెజారిటీ ఇవ్వబోతున్నారని, సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు గాదె శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నర్సీపట్నంలో ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
జనసేన నాయకులు అల్లాడ సురేష్ మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లాంటి త్రిమూర్తులని ఆయన అభివర్ణించారు. నాడు చంద్రబాబు వేసిన ఐటీ విత్తనం వల్ల హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, నేడు నర్సీపట్నంలో వేస్తున్న అభివృద్ధి విత్తనాలు భవిష్యత్తులో అలాంటి ఫలితాలనే ఇస్తాయని ఆయన అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అత్యధిక మెజారిటీతో బ్రహ్మరథం పట్టాలని ఆయన పిలుపునిచ్చారు.




