Narsipatnam: నర్సీపట్నంలో నవంబర్ 18న వైభవంగా కార్తిక దీపోత్సవం!
Narsipatnam: స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యవేక్షణలో నర్సీపట్నం శివపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నవంబర్ 18న జరగనున్న కార్తిక దీపోత్సవ ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి పరిశీలించారు.
Narsipatnam: నర్సీపట్నంలో నవంబర్ 18న వైభవంగా కార్తిక దీపోత్సవం!
నర్సీపట్నం: గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి పర్యవేక్షణలో, ఈటీవీ, ఈనాడు మరియు ఈటీవీ లైఫ్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో కార్తిక మాసం సందర్భంగా అత్యంత వైభవంగా 'కార్తిక దీపోత్సవం' నిర్వహించనున్నారు. నవంబర్ 18వ తేదీ, బుధవారం సాయంత్రం 5:30 నిమిషాలకు శివపురం గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ నందు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి గారు కాలేజీ మైదానంలో స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్యం, పరిసరాల శుభ్రత తదితర అంశాలపై సానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబుతో కలిసి పరిశీలించిన ఆమె, మున్సిపల్ సానిటరీ సిబ్బందికి పలు కీలక సూచనలు, సలహాలు జారీ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కౌన్సిలర్లు ధనమిరెడ్డి మధు, లాలం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ పద్మావతి గారు మాట్లాడుతూ.. గత సంవత్సరం అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్తిక దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. పవిత్రమైన కార్తిక మాసంలో జరిగే ఈ దీపోత్సవంలో పాల్గొంటే ఆ పరమశివుని కరుణాకటాక్షాలు మెండుగా లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. నవంబర్ 18న జరగబోయే ఈ ఆధ్యాత్మిక మహాక్రతువులో నర్సీపట్నం, దాని పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.




