Anakapalli: రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే కొణతాల పరిశీలన

Anakapalli: అనకాపల్లి 80వ వార్డు విలీన గ్రామాల్లో రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు. పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Sept 2026 1:45 PM IST
Anakapalli
X

Anakapalli: రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే కొణతాల పరిశీలన

అనకాపల్లి: నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 80వ వార్డు పరిధిలోని విలీన గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పరిశీలించారు. ఇందులో భాగంగా రాజుపాలెం, గొర్లివానిపాలెం, వల్లూరు, ఎరుకువానిపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.

అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 80వ వార్డు కూటమి నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

80వ వార్డు పరిధిలోని విలీన గ్రామాల్లో ఇప్పటికే సుమారు రూ.5.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కూటమి నాయకులు వెల్లడించారు. రాజుపాలెంలో రహదారులు, కళ్యాణ మండపం, రాజుపాలెం–వల్లూరు రహదారి, బరేల్ గ్రౌండ్, గొర్లివానిపాలెంలో రహదారులు, కమ్యూనిటీ హాల్, బరేల్ గ్రౌండ్, వల్లూరులో కళ్యాణ మండపం, మరిడిమాంబ ఆలయ రహదారి, బీటీ రోడ్డు, ఎరుకువానిపాలెం నుంచి జాతీయ రహదారి NH-16 వరకు నూతన రహదారి, బరేల్ గ్రౌండ్ తదితర పనులు చేపట్టినట్లు వివరించారు.

పర్యటనలో భాగంగా ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు కూటమి నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.

విలీన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారని కూటమి నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 80వ వార్డు కూటమి నాయకులు సత్యనారాయణ, స్వర్ణ శ్రీను, మారిశెట్టి భాస్కరరావు, చేబోలు దుర్గాప్రసాద్, శ్రీను, లక్ష్మణ్ కుమార్, ప్రభాకర్, కే. బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI