Anakapalli: అనకాపల్లిలో 43 నూతన ఇళ్లకు ప్రొసీడింగ్స్ పంపిణీ
Anakapalli: అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో నూతనంగా మంజూరైన 43 గృహాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఏపీ హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు ప్రొసీడింగ్స్ అందజేశారు.
Anakapalli: అనకాపల్లిలో 43 నూతన ఇళ్లకు ప్రొసీడింగ్స్ పంపిణీ
అనకాపల్లి: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలో నూతనంగా మంజూరైన 43 గృహాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. గృహం మంజూరైన 45 రోజుల్లో బేస్‌మెంట్ పనులు ప్రారంభిస్తే తొలి విడత నిధులు అందుతాయని తెలిపారు. గతంలో మంజూరైన గృహాల్లో సుమారు 3,000 ఇళ్లు ఇంకా పూర్తికావాల్సి ఉందని, లబ్ధిదారులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.
ప్రస్తుత గృహ నిర్మాణ పథకం కింద రూ.2.50 లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. బీసీ లబ్ధిదారులకు అదనపు ప్రోత్సాహకాలు కూడా అందుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన వారు సమీప సచివాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కొణతాల పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, లైటింగ్ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
హౌసింగ్ నిబంధనలకు అనుగుణంగా గృహాలను నిర్మించుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, హౌసింగ్ శాఖ అధికారులు, సిబ్బంది, గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు. హౌసింగ్ ఈఈ శ్రీనివాస్, డీఈఈ మధురవాణి, ఏఈ కె. పింకీ తదితరులు హాజరయ్యారు.




