Anakapalli: వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి కొనసాగుతున్న వలసలు!
Anakapalli: జీవీఎంసీ స్థానిక ఎన్నికల వేళ అనకాపల్లి 109వ డివిజన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమరశెట్టి రామ్కీ సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
Anakapalli: వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి కొనసాగుతున్న వలసలు!
అనకాపల్లి: జీవీఎంసీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుండగా.. మరోవైపు పార్టీల్లో చేరికలు రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా అనకాపల్లిలో జనసేన పార్టీలోకి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి చేతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సుమారు 64 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో.. ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ 109వ డివిజన్లో పార్టీ మార్పులు చర్చనీయాంశంగా మారాయి.
ఈ క్రమంలోనే, ఆదివారం ఉదయం సుమారు 200 మంది వైఎస్సార్సీపీ నాయకులు జనసేనలో చేరినట్లు సమాచారం. తాజాగా రాత్రి 7 గంటల సమయంలో లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో మరో 20 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమరశెట్టి రామ్కీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రామ్కీ నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు స్వాగతం పలికారు. రానున్న జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో 109వ డివిజన్‌తో పాటు అనకాపల్లిలోని ఆరు డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుస చేరికలతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ కార్యక్రమంలో 109వ డివిజన్ ఇన్చార్జ్ బుద్ధ జ్యోతి శ్రీనివాస్, కాండ్రేగుల శ్రీరామ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాండ్రేగుల చందుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




