Anakapalli: రూ.45 లక్షలతో క్రికెట్ స్టేడియం అభివృద్ధి - కలెక్టర్
Anakapalli: అనకాపల్లిలో విశాఖ ఫార్మా లిమిటెడ్ సీఎస్‌ఆర్ గ్రాంట్‌తో క్రికెట్ స్టేడియం అభివృద్ధి. ప్రహరీ గోడ, వాలీబాల్ కోర్టు ప్రారంభించిన కలెక్టర్ విజయ క్రిష్ణన్.
Anakapalli: రూ.45 లక్షలతో క్రికెట్ స్టేడియం అభివృద్ధి - కలెక్టర్
అనకాపల్లి: జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. పరవాడలోని క్రీడా వికాస కేంద్రం (KVK) వద్ద రూ.45 లక్షల అంచనా వ్యయంతో క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం పరవాడలోని క్రీడా వికాస కేంద్రం వద్ద క్రికెట్ స్టేడియం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులతో పాటు వాలీబాల్ కోర్టు ఏర్పాటును జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ క్రీడను మరింత అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్టేడియంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్టేడియం పరిసరాల్లోని పొదలను తొలగించడం, భూమిని చదును చేయడం, గ్రౌండ్‌లో కంకర నింపడం, క్రికెట్ పిచ్‌లను ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
స్టేడియం అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని M/s. విశాఖ ఫార్మా లిమిటెడ్ (Ramky) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ CSR గ్రాంట్ కింద అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్రికెట్ గ్రౌండ్‌కు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ, APEWIDC విభాగీయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ G.J.V. ప్రసాద్, M/s. విశాఖ ఫార్మా లిమిటెడ్ (Ramky) జనరల్ మేనేజర్ (HR) శ్రీకాంత్, సంస్థ ప్రతినిధులు, ఎంపీడీఓ, పరవాడ స్పెషల్ ఆఫీసర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




