Anakapalli: అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు - కలెక్టర్ విజయ కృష్ణన్
Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులకు ఆదేశం.
Anakapalli: అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు - కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి: ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా భూసంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరాలు-1, 2లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, డీఆర్వో వై. సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే వివరాలు సేకరించారు.
అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అర్జీల పరిష్కార ప్రక్రియలో భాగంగా అధికారులు దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడాలని కలెక్టర్ తెలిపారు. పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం సాధ్యం కాని దరఖాస్తుల విషయంలో కారణాలను అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. తద్వారా అర్జీలు తిరిగి రీ-ఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణరావు, పీజీఆర్‌ఎస్, ఎన్‌ఏఓబీ, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్సైజ్ అధికారి వి. సుదీర్, జిల్లా సర్వే మరియు భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.




