Anakapalle: శారదా నదికి గంగా హారతి, వరుణ యాగం
Anakapalle: అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించి, శారదా నదికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గంగా హారతి సమర్పించారు.
Anakapalle: శారదా నదికి గంగా హారతి, వరుణ యాగం
అనకాపల్లి: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ అనకాపల్లి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు.
దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా వరుణ యాగం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రకృతి అనుకూలంగా ఉండి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరుణ యాగంలో భాగంగా మంగళవారం సాయంత్రం వరుణ, నూకాంబిక అమ్మవారి ఉత్సవమూర్తులను దేవస్థానం నుంచి శారదా నది ఘాట్ వరకు సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
అనంతరం కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో శారదా నదిలో ఉత్సవమూర్తుల నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం శారదా నదీమాతకు ప్రత్యేకంగా గంగా హారతి సమర్పించి, వరుణ పాయసం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రకృతి అనుకూలంగా ఉండి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు, ప్రజలకు మేలు జరగాలని కొణతాల రామకృష్ణ ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీల నాగ శ్రీను, జీవీఎంసీ అధికారులు, డైరెక్టర్లు, దేవస్థానం ఈవో, సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




