Anakapalle: నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం
Anakapalle: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఘనంగా వరుణ యాగం నిర్వహించారు.
Anakapalle: నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కొలువైన అనకాపల్లి శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నీటి వనరులు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడిని ప్రార్థించారు. వర్షాధారంగా జీవించే రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి, రైతులు, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలనే సంకల్పంతో వేదోక్త పద్ధతిలో యాగాన్ని నిర్వహించారు.
వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, వరుణ జపం, వరుణ యాగం, సహస్రఘటాభిషేకం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌరిమాన్ పటేల్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు, మల్లా సురేంద్ర, కోట్ని బాలాజీ, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈఓ యాళ్ల శ్రీధర్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణ యాగం భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది.




