Anakapalle: అనకాపల్లిలో ఆధునీకరించిన రాజీవ్ గాంధీ స్టేడియం ప్రారంభం
Anakapalle: ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధులు రూ.2.89 కోట్లతో ఆధునీకరించిన అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.
Anakapalle: అనకాపల్లిలో ఆధునీకరించిన రాజీవ్ గాంధీ స్టేడియం ప్రారంభం
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులు పూర్తికావడంతో క్రీడాకారులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీపీసీ లిమిటెడ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.2.89 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన స్టేడియాన్ని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.
కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ అయస్కాంత్ జెనా చేతుల మీదుగా ఆధునీకరించిన స్టేడియం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. అనకాపల్లి ప్రాంతంలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ఆధునీకరణకు ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.2.89 కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆధునీకరణ పనులతో స్టేడియం మరింత ఆకర్షణీయంగా, క్రీడాకారులకు అనుకూలంగా మారిందన్నారు. ఇండోర్ క్రీడలకు అవసరమైన వసతులు మెరుగుపడటంతో స్థానిక క్రీడాకారులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు కూడా ఈ వేదికను సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు.
క్రీడలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొణతాల పేర్కొన్నారు. అనకాపల్లి ప్రాంతం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు వెలుగులోకి రావాలనే లక్ష్యంతో క్రీడా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అనకాపల్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ అయస్కాంత్ జెనాను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ సందర్భంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం క్రీడాకారులతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం స్వయంగా షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, ఎన్టీపీసీ అధికారులు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




