Anakapalle: ఆరు లైన్ల హైవేకు డీపీఆర్ - నూకాంబికా జంక్షన్‌లో ఫ్లైఓవర్

Anakapalle: అనకాపల్లి-రాజమండ్రి ఆరు లైన్ల హైవేకు డీపీఆర్ రూపకల్పన. నూకాంబికా జంక్షన్‌లో రూ.50 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి క్షేత్రస్థాయి పరిశీలన.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 25 Sept 2026 6:38 PM IST
Anakapalle
X

Anakapalle: ఆరు లైన్ల హైవేకు డీపీఆర్ - నూకాంబికా జంక్షన్‌లో ఫ్లైఓవర్

అనకాపల్లి: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. అనకాపల్లి–ఆనందపురం తరహాలోనే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఆరు లైన్ల రహదారి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో అనకాపల్లిలోని నూకాంబికా దేవస్థానం ముఖద్వారం వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైంది. ఈ ప్రతిపాదనలో భాగంగా జాతీయ రహదారుల అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు.

ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం

నూకాంబికా దేవస్థానం ముఖద్వారం జాతీయ రహదారిపై ఉండటంతో భక్తులు, స్థానికులు, రైతులు రహదారి దాటే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రహదారి దాటేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్‌తో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఫ్లైఓవర్ నిర్మాణంతో జాతీయ రహదారిపై ప్రధాన ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా స్థానిక రాకపోకలు సులభతరం కానున్నాయి. అనకాపల్లి నుంచి ఎస్‌ఈజెడ్, స్టీల్ ప్లాంట్, ఫార్మా సిటీ వైపు వెళ్లే వాహనదారులకు కూడా ఈ మార్గం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

ఇప్పటికే సుమారు రూ.50 కోట్లతో ప్రతిపాదన సిద్ధమైన నేపథ్యంలో అవసరమైన సర్వేలు, రికార్డుల పరిశీలన పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తైన అనంతరం సుమారు ఏడాది వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

అనకాపల్లి-స్టీల్ ప్లాంట్ గేట్ వరకు ఆరు లైన్ల రహదారి

అనకాపల్లి నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల అధికారులను కోరినట్లు తెలిపారు.

లక్కీపాడు, కోడికొర్మానపాలెం జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ఫ్లైఓవర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎంపీ ద్వారా కూడా జాతీయ రహదారుల అధికారులకు ఈ అంశంపై లేఖ అందజేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ రహదారి జాతీయ రహదారుల సంస్థ పరిధిలో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలోపు ప్రతిపాదిత అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో ఆమోదింపజేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే అనకాపల్లి నుంచి విశాఖపట్నం వైపు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.

పాత ప్రభుత్వ కార్యాలయాల స్థానంలో కొత్త భవనాలు

మరోవైపు అనకాపల్లిలోని పాత ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై కూడా అధికారుల దృష్టి సారించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, ఎంఆర్వో కార్యాలయం తదితర భవనాలు బ్రిటిష్ కాలం నాటి పురాతన నిర్మాణాలు కావడంతో వాటి స్థానంలో ఆధునిక భవనాలు నిర్మించే ప్రతిపాదనపై చర్చ జరిగింది.

ఈ మేరకు నాలుగు అంతస్తుల సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంఆర్వో కార్యాలయాన్ని కొత్త భవనానికి తరలించిన అనంతరం ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని తొలగించి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

అనకాపల్లి మండలాన్ని విభజించాలని ప్రతిపాదన

అనకాపల్లి మండలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిసివుండటంతో పరిపాలనా పరంగా సిబ్బందిపై పని భారం పెరుగుతోందని, ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అనకాపల్లి అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుత పరిపాలనా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం ఈ అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అనంతరం రెండు మండలాలకు అవసరమైన ఎంఆర్వో కార్యాలయ భవనాలు, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.

మొత్తంగా అనకాపల్లి–రాజమండ్రి ఆరు లైన్ల రహదారి అభివృద్ధి, నూకాంబికా జంక్షన్ ఫ్లైఓవర్, అనకాపల్లి–స్టీల్ ప్లాంట్ గేట్ వరకు రహదారి విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణ వంటి ప్రతిపాదనలు అమలైతే ప్రాంతీయ రవాణా, ప్రజా భద్రత, పరిపాలనా సౌకర్యాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI