Polavaram: పోలవరం జిల్లాలో ఘనంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం!
Polavaram: పోలవరం జిల్లా ముసురుమిల్లి రిజర్వాయర్లో పీఎంఎంఎస్వై, డీఏ-జేజీయూఏ పథకాల కింద చేప పిల్లలను విడుదల చేసిన కలెక్టర్ కె. దినేష్ కుమార్.
Polavaram: పోలవరం జిల్లాలో ఘనంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం!
Polavaram: పోలవరం జిల్లాలో గిరిజన మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి, మత్స్య సంపదను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన (PMMSY), డీఏ-జేజీయూఏ (DA-JGUA) పథకాల కింద చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు.పోలవరం జిల్లాలో గిరిజన మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి, మత్స్య సంపదను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన (PMMSY), డీఏ-జేజీయూఏ (DA-JGUA) పథకాల కింద చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ముసురుమిల్లి రిజర్వాయర్ పరిధిలోని సీతపల్లి పాత వంతెన సమీపంలో జాగారంపల్లి వద్ద చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
సొంత పొలాల్లో చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవాలి
గిరిజన రైతులు తమ సొంత పొలాల్లో చేపల చెరువులు (ఫామ్పాండ్లు) తవ్వుకునేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సామూహిక మత్స్య సంపద అభివృద్ధితోపాటు వ్యక్తిగత భూముల్లోనూ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ను ప్రోత్సహిస్తే గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం,ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆక్వాకల్చర్ అభివృద్ధి చెంది, చేపలు, రొయ్యల ఉత్పత్తులు అమెరికా వంటి దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని గుర్తుచేశారు. పోలవరం జిల్లాలోనూ మత్స్య సంపద అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
9 జలవనరుల్లో 4,10,400 చేప పిల్లలు
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో గుర్తించిన 9 జలవనరుల్లో మొత్తం 4,10,400 చేప పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎంఎంఎస్వై పథకం కింద 1,29,600, డీఏ-జేజీయూఏ పథకం కింద 2,80,800 చేప పిల్లలను కేటాయించారు. జలవనరుల్లో చేపల ఉత్పత్తి పెంచడంతోపాటు గిరిజన మత్స్యకార సహకార సంఘాల సభ్యులకు ఉపాధి, ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
మార్గదర్శకాల మేరకు మత్స్యశాఖ అధికారులు, చేప పిల్లల విడుదల కమిటీ సభ్యులు, మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మత్స్య వనరులను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా శాఖాపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరపాటి ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ డి. పృథ్వీరాజ్ కుమార్, మత్స్యశాఖ ప్రధాన కార్యాలయం పరిశీలకులు లాల్ మొహమ్మద్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్.కె. దిల్షాద్,మత్స్య అభివృద్ధి అధికారులు కె. హరీష్, తాసిల్దార్ సిహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు, పంచాయతీ కార్యదర్శి భారతి,టి.వి. రవికుమార్,గ్రామ సహాయకులు, గిరిజన మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




