Paderu: భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్ - జేసీ శ్రీ పూజ

Paderu: అల్లూరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు హై అలర్ట్ జారీ చేసిన జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీ పూజ. సహాయక చర్యలపై సమీక్ష.

SAI, PADERU
Published on: 23 Sept 2026 5:25 PM IST
Paderu
X

Paderu: భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్ - జేసీ శ్రీ పూజ

పాడేరు: అల్లూరు జిల్లా పాడేరు డివిజన్ లో సైక్లోన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో హై అలర్ట్ ప్రకటించి, ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీ పూజ అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా మండల స్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని 11 మండలాల తహసీల్దార్లు, వీఆర్వోలు, వీఎస్ఓలు, మండల సర్వేయర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెవెన్యూ, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా వాగులు, వంకలు, గెడ్డలు పొంగిపొర్లుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌హెచ్‌ఓలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి మండలంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, మండలంలో చోటుచేసుకునే పరిస్థితులు, వర్షపాతం, వాగులు, రహదారులు, ప్రజా రవాణా, విద్యుత్ తదితర అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు అందించాలని ఆదేశించారు.

ప్రమాదకరమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన సిబ్బందిని నియమించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

సెన్సస్‌కు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఫారమ్-6, ఫారమ్-8లకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

రాబోయే శనివారం ఇంటర్, డిగ్రీ కళాశాలలను సందర్శించి 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను గుర్తించి, వారిని ఓటర్ల జాబితాలో నమోదు చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విలేజ్ సర్వేయర్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నాలుగు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న నాయీ కుల ధ్రువపత్రాల దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, వాటిని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు.

ఆర్‌డీఓ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఆలస్య జనన, మరణ నమోదు కేసులను కూడా త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆర్‌డీఓను ఆదేశించారు.

ప్రతి గురువారం తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. వివిధ శాఖలకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలను సమావేశంలో చర్చించి, వాటిని సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

తహసీల్దార్లకు అప్పగించిన పీజీఆర్‌ఎస్, ఈ-ఆఫీస్, ఆఫ్‌లైన్ ఎఫ్‌పీ షాపుల తనిఖీలు, ఆన్‌లైన్ రెవెన్యూ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనులను ఈ శనివారం లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన పనులు పూర్తి చేయని పక్షంలో ఆదివారం కలెక్టరేట్‌కు హాజరై పెండింగ్ పనులపై సమీక్షకు సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లకు సూచించారు.

తహసీల్దార్లు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఫెయిర్ ప్రైస్ షాపులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పౌరసరఫరాల అధికారి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రస్తుత సైక్లోన్ పరిస్థితుల్లో ప్రజల భద్రతతో పాటు పరిపాలనా సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీ పూజ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, పాడేరు డివిజన్ ఆర్‌డీఓ ఎం. భుజంగరావు, ఏడీ సర్వే ఈశ్వర దొర, జిల్లా పౌరసరఫరాల అధికారి వి. మోహన్ రావు, 11 మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU