Alluri District: సెన్సస్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా చూడాలి

Alluri District: అల్లూరి జిల్లాలో సెన్సస్ ప్రక్రియపై DRO లోకేశ్వరరావు సమీక్ష. తప్పుల్లేకుండా డేటా నమోదు చేయాలని ఛార్జ్ ఆఫీసర్లకు ఆదేశం.

SAI, PADERU
Published on: 23 Sept 2026 6:20 PM IST
Alluri District
X

Alluri District: సెన్సస్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా చూడాలి

అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో కొనసాగుతున్న సెన్సస్‌కు సంబంధించిన ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు ఛార్జ్ ఆఫీసర్లను ఆదేశించారు. సెన్సస్ డేటా ఖచ్చితత్వం, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి వివరాన్ని నిబంధనలు మరియు నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.

బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా రెవెన్యూ అధికారులతో డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెన్సస్ ప్రక్రియ పురోగతి, డేటా పరిశీలన, హౌస్ లిస్టింగ్ బ్లాకుల విభజన, జనాభా వివరాల నమోదు తదితర అంశాలపై చర్చించారు.

డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ సూచనల మేరకు జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్–2011లోని వివరాలను ప్రస్తుత సెన్సస్ డేటాతో సమగ్రంగా పోల్చి పరిశీలించాలని ఛార్జ్ ఆఫీసర్లను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. 2011 డేటాతో పోల్చినప్పుడు ఏవైనా మార్పులు, వ్యత్యాసాలు గుర్తించినట్లయితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన సవరణలు చేపట్టాలని సూచించారు.

సెన్సస్ ప్రక్రియలో భాగంగా ప్రతి రోజు కనీసం నాలుగు అంశాలను/వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, సవరణలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నమోదు చేస్తున్న వివరాల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలోని సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి నిర్ధారించుకోవాలని సూచించారు.

జిల్లాకు సంబంధించిన వృక్షజాలం మరియు జంతుజాలం (Flora & Fauna) వివరాలు కూడా సెన్సస్ హ్యాండ్‌బుక్‌లో సమగ్రంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని ఛార్జ్ ఆఫీసర్లను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు.

జిల్లా ప్రత్యేక భౌగోళిక, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అందుబాటులో ఉన్న అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నమోదు చేయాలని సూచించారు.

హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లో జనాభా 800 మందికి మించి ఉన్న ప్రాంతాలను జనాభా పరిమాణాన్ని బట్టి ఒకటి లేదా రెండు సబ్ హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా విభజించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు.

సెన్సస్ కార్యకలాపాలు సులభంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు హౌస్ లిస్టింగ్ బ్లాకుల పరిమాణం, జనాభా వివరాలను పరిశీలించి అవసరమైన చోట సబ్ హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా విభజించే ప్రక్రియను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని సూచించారు.

సెన్సస్‌కు సంబంధించిన ప్రతి దశలో డేటా ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవాలని, ఒకసారి నమోదు చేసిన వివరాలను సంబంధిత అధికారిక రికార్డులతో మరోసారి పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి సూచించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సందేహాలు లేదా వ్యత్యాసాలు గుర్తించినప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిబంధనల ప్రకారం పరిష్కరించిన అనంతరం మాత్రమే తుది వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.

సెన్సస్ ప్రక్రియకు సంబంధించి ఉన్నతాధికారులు జారీ చేసే మార్గదర్శకాలను ప్రతి ఛార్జ్ ఆఫీసర్ తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశించిన గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లాలోని 11 మండలాల తహసీల్దార్లు, సంబంధిత ఛార్జ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU