Alluri: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కలెక్టర్ నిషాంతి సమీక్ష
Alluri: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ నిషాంతి టి, పరిశీలకులు రోణంకి కూర్మనాథ్ అధికారులతో సమీక్షించారు.
Alluri: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కలెక్టర్ నిషాంతి సమీక్ష
అల్లూరి సీతారామరాజు జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు (ROలు), నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి నిషాంతి టి. ఆదేశించారు.
గురువారం పాడేరు కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆర్ఓలు, నోడల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలు, ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలపై తగిన సూచనలు జారీ చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించి అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ఏర్పాట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై నిరంతర సమీక్ష నిర్వహించేందుకు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులు నిర్దేశించిన సమయానికి సమీక్షకు హాజరై, తమ పరిధిలోని ఎన్నికల ఏర్పాట్లపై స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.
ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి: ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్
ఈ సమావేశంలో పాల్గొన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులు, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ శ్రీ రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్ మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ గౌరవించి పాటించాలని కోరారు.
ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులందరూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, ఎన్నికల శిక్షణా కార్యక్రమాల్లో వివరించిన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి దశలోనూ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎన్నికలకు సంబంధించిన విధులు, బాధ్యతలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, సమన్వయం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ఎన్నికల విధులకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తక్షణమే పరిష్కరించుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ, పాడేరు సబ్ కలెక్టర్ శ్రీ కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్, అదనపు ఎస్పీ శ్రీమతి శ్రుతి తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎన్నికల విధులకు సంబంధిత అధికారులు హాజరయ్యారు.




