Madhurawada: జీవీఎంసీ 7వ వార్డులో కూటమి గెలుపునకు సమష్టి కృషి: సందీప్

Madhurawada: జీవీఎంసీ 7వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి దేవర మహేశ్వరి విజయానికి కూటమి నేతలు సమష్టిగా పనిచేయాలని పంచకర్ల సందీప్, మొల్లి లక్ష్మణరావు పిలుపునిచ్చారు.

JAI RAM, MADURAWADA
Published on: 25 Oct 2026 11:01 PM IST
Madhurawada
X

Madhurawada: జీవీఎంసీ 7వ వార్డులో కూటమి గెలుపునకు సమష్టి కృషి: సందీప్

మధురవాడ: జీవీఎంసీ పరిధిలోని 7వ వార్డులో కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ పంచకర్ల సందీప్, టీడీపీ సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. కూటమి మద్దతుతో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అర్జల దేవర మహేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఆదివారం వార్డులోని శివశక్తినగర్ రోడ్డు, స్వయంకృషినగర్, ముత్యాలమ్మ కాలనీ, వివేకానందనగర్, అయ్యప్పనగర్, వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి దేవర మహేశ్వరిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

నాయకులు మాట్లాడుతూ.. 7వ వార్డు సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దేవర శివ స్వయంకృషితో ఎదుగుతూ ప్రజలతో మమేకమై, వారి సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆయన సేవాభావం, నిబద్ధతను గుర్తించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఆయన భార్య దేవర మహేశ్వరికి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం లభించిందని తెలిపారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. దేవర మహేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించి, 7వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA