Anakapalli: పిసినికాడ పంచాయతీపై కూటమి ఫోకస్.. అభివృద్ధే లక్ష్యంగా రాంకీ పిలుపు!

Anakapalli: అనకాపల్లి జిల్లా పిసినికాడ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 19 Nov 2026 6:59 AM IST
Anakapalli
X

Anakapalli: పిసినికాడ పంచాయతీపై కూటమి ఫోకస్.. అభివృద్ధే లక్ష్యంగా రాంకీ పిలుపు!

Anakapalli: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పిసినికాడ గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి శ్రేణులు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ కుటుంబాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, టీడీపీ అనకాపల్లి ఇన్‌ఛార్జ్, APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ మద్దతుతో బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులకు గ్రామ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి మల్ల లక్ష్మీ రాంబాబు, వార్డు సభ్యుల అభ్యర్థులకు ప్రజల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాభివృద్ధి బాధ్యత మాది..

పిసినికాడ గ్రామంతో తమకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని, ఈ ప్రాంతాన్ని సొంత గ్రామంగా భావిస్తామని రామ్కీ పేర్కొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రతి ఇంటికీ కుళాయి నీరు.. రూ.249 కోట్ల ప్రస్తావన!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యంతో సుమారు రూ.249 కోట్ల నిధులు మంజూరైనట్లు రామ్కీ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

మూడు పార్టీల సమన్వయంపై దృష్టి..

టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రామ్కీ సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి అభ్యర్థుల గురించి వివరించాలని, ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

పిసినికాడ గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన అంశాలుగా సాగిన ఈ ఆత్మీయ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI