Anakapalli: బలమైన అభ్యర్థుల ఎంపికే లక్ష్యం.. జనసేన ఎన్నికల కమిటీ భేటీ!

Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని జనసేన శ్రేణులకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 11 Oct 2026 4:08 PM IST
Anakapalli
X

Anakapalli: బలమైన అభ్యర్థుల ఎంపికే లక్ష్యం.. జనసేన ఎన్నికల కమిటీ భేటీ!

Anakapalli: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించేలా సమష్టిగా పనిచేయాలని, కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ అత్యధిక స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. బలమైన అభ్యర్థుల ఎంపికతో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ నాయకులు, కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణ కమిటీ, సమన్వయకర్తలు, నిర్వహణ దళ్ సభ్యులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆదివారం అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ పి.వి.ఎస్.ఎస్. రాజు, ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన శ్రీ వేణి, మాడుగుల నియోజకవర్గానికి చెందిన ఎం. సన్యాసినాయుడు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతానికి, క్షేత్రస్థాయిలో జనసేన బలాన్ని పెంచుకోవడానికి కీలకమని పేర్కొన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, స్థానిక ప్రజాభిప్రాయం, అభ్యర్థుల బలాబలాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నవారికే ప్రాధాన్యత

ఎన్నికల్లో విజయానికి అభ్యర్థుల ఎంపిక కీలకమని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ కలిగి ఉండటంతో పాటు ప్రజాసేవలో చురుకుగా పాల్గొనే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన అవకాశాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

కూటమి పార్టీలతో సమన్వయానికి ప్రాధాన్యత

కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ, పరస్పర అవగాహనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి స్థానంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందించుకోవడంతో పాటు ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధానాలను పాటించాలని అన్నారు.

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా సమన్వయకర్తలు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. సమన్వయం, సమర్థవంతమైన ప్రణాళిక, బలమైన అభ్యర్థుల ఎంపికతో లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI