Anakapalli: ప్రతి స్కూల్లో యోగాను తప్పనిసరి చేయాలన్న కొణతాల!

Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన దత్తక్రియ యోగ మహోత్సవంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని, ప్రతి పాఠశాలలో యోగాను తప్పనిసరి చేయాలని సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 29 Nov 2026 1:10 PM IST
Anakapalli
X

Anakapalli: ప్రతి స్కూల్లో యోగాను తప్పనిసరి చేయాలన్న కొణతాల! 

Anakapalli: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతో అవసరమని.. ప్రతి పాఠశాలలో యోగాభ్యాసాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సూచించారు. భవిష్యత్తులో యోగాను పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థుల నిత్య విద్యాభ్యాసంలో భాగం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో దత్తక్రియ యోగ ఇంటర్నేషనల్ సెంటర్, అవధూత దత్త పీఠం మైసూర్, శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రం సరసపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన దత్తక్రియ యోగ మహోత్సవం కార్యక్రమానికి కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీలకు పాదాభివందనాలు చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు.

కేవలం మూడు నెలల వ్యవధిలో 22 మంది ఉపాధ్యాయుల సహకారంతో 5,720 మంది విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.యోగాతో శారీరక దారుఢ్యమే కాకుండా మానసిక వికాసం, సానుకూల ఆలోచనా విధానం, మంచి వ్యక్తిత్వం అలవడతాయని పేర్కొన్నారు. భారతదేశంలో పుట్టిన గొప్ప యోగ సంప్రదాయాన్ని మనం విస్మరించి విదేశీయుల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించిందని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు.మరోవైపు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెల్‌ఫోన్ల వినియోగం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని కొణతాల ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు సెల్‌ఫోన్లకు బానిసలవుతూ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోజుకు కనీసం అరగంట నుంచి గంటపాటు విద్యార్థులకు యోగా నేర్పించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత తమ కుటుంబ సభ్యులకు కూడా యోగాభ్యాసాన్ని నేర్పించేలా ప్రోత్సహించాలని సూచించారు.అనకాపల్లి ప్రాంతంలో ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చింతపల్లి గణపతి శాస్త్రి ఆశ్రమ స్వామీజీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన జోనల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి కార్పొరేటర్లు, యోగా ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI