Anakapalle: అనకాపల్లిలో జనసేనలో చేరిన 200 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 108, 109 వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి షాక్. బీమరశెట్టి రాంకీ, జబర్దస్త్ హైపర్ ఆది సమక్షంలో జనసేనలోకి 200 మంది చేరిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 25 Oct 2026 3:20 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో జనసేనలో చేరిన 200 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు!

అనకాపల్లి: అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోని 108, 109వ వార్డుల్లో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరినట్లు జనసేన నాయకులు వెల్లడించారు. అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీమరశెట్టి రాంకీ, ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

డాక్టర్ లక్ష్మీనరసింహ, ఎస్‌డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో 108, 109వ వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మచ్చలేని నాయకుడిగా కొణతాల రామకృష్ణను తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. రానున్న జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, వారిని గెలిపించాలని ప్రజలను కోరారు.

2024 ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో ప్రచారం నిర్వహించామని, అనంతరం అనకాపల్లి నియోజకవర్గంలో కొణతాల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం చేశామని హైపర్ ఆది తెలిపారు. కొణతాల రామకృష్ణపై అభిమానంతో మరోసారి అనకాపల్లికి వచ్చి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, కొణతాల రామకృష్ణ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తుండటం తనకు ఆనందాన్ని కలిగించిందని హైపర్ ఆది పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన 109వ వార్డు ఇన్‌ఛార్జ్ స్వర్ణ శ్రీను, మల్ల శ్రీను సహా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI