Anakapalli: ప్రతి నెల 1న వెల్ఫేర్ డే: కలెక్టర్ విజయ కృష్ణన్!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల 1వ తేదీని 'వెల్ఫేర్ డే'గా నిర్వహిస్తామని, అధికారులు నెలకు కనీసం 8 రోజులు ఫీల్డ్ విజిట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.
Anakapalli: ప్రతి నెల 1న వెల్ఫేర్ డే: కలెక్టర్ విజయ కృష్ణన్!
Anakapalli: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సానుకూల ప్రజాభిప్రాయాన్ని మరింత పెంచేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ప్రతి నెల 1వ తేదీని ‘వెల్ఫేర్ డే’గా నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు.
అమరావతిలో ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనంతరం అధికారులు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, జల జీవన్ మిషన్ పనులు, పంచాయతీరాజ్ రహదారులు, అన్న క్యాంటీన్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని సూచించారు.
ప్రభుత్వ సేవలు, శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని ప్రతి నెల కనీసం 5 శాతం పెంచేలా పనిచేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆరోగ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, రెవెన్యూ, అన్న క్యాంటీన్లు, తాగునీరు, మైనింగ్ తదితర శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించి విశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు.
డేటా నమోదులో నిర్లక్ష్యం వద్దు
రాష్ట్ర జీఎస్‌డీపీతో పాటు ఇతర ఆర్థిక గణాంకాల లెక్కింపునకు బేస్ ఇయర్‌ను 2022-23గా సవరించిన నేపథ్యంలో శాఖల వారీగా డేటా సేకరణ, నమోదు ప్రక్రియపై కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. ప్రతి నెల 5వ తేదీలోగా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని సమాచారం, కేపీఐ డేటాను పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ డేటా ఆధారంగా ప్రతి నెల 9వ తేదీన జిల్లా ఆర్థిక నివేదిక విడుదలవుతుందని తెలిపారు. డేటా నమోదులో తప్పులు లేదా జాప్యం జరిగితే అవి నివేదికల్లో నమోదవుతాయని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల పరిష్కారం, ప్రజల ఫిర్యాదుల విచారణలో కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇ-ఆఫీస్ డేటా ఆధారంగా ఫైళ్ల పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకుంటున్న అధికారుల పనితీరును ప్రస్తావించారు.
PGRS ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. జాప్యం జరిగితే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఫైళ్ల పరిష్కార స్థితిగతులను డీఆర్‌ఓ ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు.
అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
ప్రభుత్వ శాఖలపై వచ్చే ప్రతికూల వార్తలు, అసత్య ప్రచారాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు వాస్తవ సమాచారాన్ని ఐ&పీఆర్ శాఖకు అందించి, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులు ప్రభుత్వ పథకాలు, తమ శాఖల విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు.
మూతపడిన MSMEల పునరుద్ధరణకు లక్ష్యం
జిల్లాలో పనిచేయకుండా మూతపడిన MSME పరిశ్రమల జాబితాను సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ, డీఆర్‌డీఏ, మెప్మా, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్లు, బిల్లుల చెల్లింపు వివరాలను పరిశీలించి పరిశ్రమలు క్రియాశీలకంగా ఉన్నాయా లేదా తెలుసుకోవాలని సూచించారు.
ఫీల్డ్ విజిట్లు నిర్వహించి పరిస్థితులను పరిశీలించాలని, ఈ ఏడాది చివరి నాటికి కనీసం 30 శాతం మూతపడిన MSMEలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇళ్ల స్థలాలపై పెండింగ్ విచారణలు పూర్తి చేయాలి
లేఅవుట్లలో ఇళ్ల స్థలాలకు సంబంధించి అనర్హులపై పెండింగ్‌లో ఉన్న విచారణలను వెంటనే పూర్తి చేయాలని డీఆర్‌ఓను ఆదేశించారు. విచారణ అనంతరం అనర్హులకు జారీ చేసిన నోటీసుల ప్రకారం వారి పేర్లపై ఉన్న పాత రిజిస్ట్రేషన్ డీడ్లను రద్దు చేసి, అర్హులకు స్థలాలు కేటాయించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
దీనిపై వచ్చే వారంలోగా కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. G.O.Ms No.30 కింద ఉన్న క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.
సాగు, పశుగ్రాసం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ వాటి ప్రభావం పంటల సాగు విస్తీర్ణంలో తగినంతగా కనిపించడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ, వ్యవసాయం, పశుసంవర్ధక, తాగునీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
గ్రామాల వారీగా పశువుల నీటి తొట్టెల లభ్యత, వాటిలో నీటిని నింపే వ్యవస్థను తనిఖీ చేయాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. పశుగ్రాసం, పొడి గ్రాసం సరఫరాపై తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతోందో లేదో పరిశీలించాలని ఆదేశించారు. వరి నారుమళ్లు, ఊడ్పులు లేదా డ్రై సోయింగ్ ద్వారా వీలైన మేరకు ఖాళీ భూములను సాగులోకి తీసుకురావాలని సూచించారు.
తాగునీటి సరఫరాలో రాజీ వద్దు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు తగినంత పరిమాణంలో సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరా అత్యంత సున్నితమైన అంశమని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సుమారు రూ.50 లక్షల నిధులను సద్వినియోగం చేసుకుని నీటి రవాణా అవసరం లేకుండా తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లోనూ ప్రజలకు సరిపడా తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జలధార పథకం కింద ప్రతిపాదించిన పనులన్నింటినీ కవర్ చేయాలని, ఇరిగేషన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీరు వృథా కాకుండా ఫామ్ పాండ్స్‌లోకి మళ్లించి నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నెలకు 8 రోజులు ఫీల్డ్ విజిట్లు తప్పనిసరి
ప్రతి అధికారి నెలకు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ స్పష్టం చేశారు.
జిల్లా ర్యాంకింగ్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, రాబోయే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల పనితీరు మెరుగుపడాలని ఆదేశించారు. జిల్లా ర్యాంకింగ్‌లో పురోగతి సాధించేలా ప్రతి శాఖ తన పనితీరును సమీక్షించుకుని నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.




