Vijayawada: వైభవంగా విజయవాడ ఉత్సవ్-సీజన్ 2 ఏర్పాట్లు ప్రారంభం!

Vijayawada: విజయవాడలో దసరా శోభను చాటిచెప్పేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్-సీజన్ 2 ఏర్పాట్లకు సింగ్‌నగర్‌లో ఘనంగా శంకుస్థాపన చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 5 Oct 2026 6:07 PM IST
Vijayawada
X

Vijayawada: వైభవంగా విజయవాడ ఉత్సవ్-సీజన్ 2 ఏర్పాట్లు ప్రారంభం!

Vijayawada: విజయవాడలో దసరా శోభను మరింత వైభవంగా చాటిచెప్పేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–సీజన్ 2 ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉత్సవాలకు సంబంధించిన పనులకు బోండా సిద్ధార్థ, గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ.. గత ఏడాది ప్రజల విశేష ఆదరణ పొందిన విజయవాడ ఉత్సవ్‌ను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్సవాలకు హాజరుకానున్నారని చెప్పారు. దుర్గమ్మ, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికత, ఆహ్లాదం, కళా సంస్కృతుల సమ్మేళనంతో ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించనున్నామని తెలిపారు. పున్నమిఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

గొట్టిముక్కల రఘు మాట్లాడుతూ.. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్–2కు అంకురార్పణ జరిగిందన్నారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ ఫార్మా కాలేజీ, పవిత్ర సంగమం ప్రాంతాల్లో విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

స్థానిక కళాకారులకు పెద్దపీట వేస్తూనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాంస్కృతిక బృందాలను విజయవాడకు తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలు కళాకారులకు ఉపాధి, ప్రోత్సాహం కల్పించే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, క్రాకర్ షోలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఈసారి ఉత్సవాలకు మరింత ఆకర్షణ తీసుకురానున్నాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని మాట్లాడుతూ.. పున్నమిఘాట్‌తో పాటు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 40–45 రకాల జానపద, సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు, ప్రముఖ గాయకులు, భజన్ జామింగ్ బృందాలు, లైవ్ బ్యాండ్స్, మ్యూజికల్ కాన్సెర్ట్స్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

విద్యార్థులు, యువత, మహిళలు, కుటుంబాలను భాగస్వాములను చేసేలా ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న జరిగే ముగింపు వేడుకలు విజయవాడ ఉత్సవ్‌కు ఘనమైన ముగింపుగా నిలవనున్నాయి. మూడు గజరాజులు, అమ్మవారి తొమ్మిది అవతారాల ప్రతిరూపాలు, సుమారు నాలుగు వేల మంది కళాకారులతో ఏలూరు రోడ్డులో భారీ కార్నివాల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్నివాల్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని తెలిపారు.

విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.