Vijayawada: దేవాలయాల్లో అర్చకుల నియామకంపై దేవాదాయ శాఖ స్పష్టత
Vijayawada: విజయవాడలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మీడియా సమావేశం. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రతిభ ఆధారంగానే అర్చకుల నియామకం.
Vijayawada: దేవాలయాల్లో అర్చకుల నియామకంపై దేవాదాయ శాఖ స్పష్టత
విజయవాడ: రాష్ట్రంలోని దేవాలయాల్లో జరిగే ప్రధాన పూజా కార్యక్రమాలు, వైదిక కైంకర్యాలు పూర్తి శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా సాగేందుకు నిష్ణాతులైన అర్చకులను ఎంపిక చేసేలా ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోందని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు.
కేవలం ప్రతిభకే పెద్దపీట వేస్తూ రాత, మౌఖిక (ఇంటర్వ్యూ) పరీక్షల ద్వారా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని సి.వి. రెడ్డి చారిటీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 344 వైదిక సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని కమిషనర్ వివరించారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
మొదటి విడత నియామకాల్లో భాగంగా 580 మంది వేదపండితులు దరఖాస్తు చేసుకోగా, అత్యంత ప్రతిభ కనబరిచిన 14 మంది వేద పండితులను పారదర్శకంగా ఎంపిక చేసి వివిధ దేవాలయాల్లో నియమించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రెండో దశలో అర్చక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 107 అర్చక పోస్టులకు 816 దరఖాస్తులు అందగా, అర్హతలను పరిశీలించిన అనంతరం 441 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేసినట్లు చెప్పారు.
ఇవాల్టి నుంచి ఆగమాల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తున్నామని, స్మార్తాగమం పరీక్షతో ఈ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. తదుపరి రోజుల్లో పాంచరాత్ర, వైఖానస, శైవ, వీరశైవ, గ్రామ దేవత ఆగమాలకు సంబంధించి విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పరీక్షలను పారదర్శకముగా, పకడ్బందీగా నిర్వహిచడం కోసం దేవదాయ శాఖ సీనియర్ అధికారులు, పర్యవేక్షకులు స్థాయి సిబ్బందితో ప్రత్యేకముగా ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు.
రాత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తామన్నారు. ఆయా ఆగమాలలో నిష్ణాతులైన పండితులే ఈ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. రాత, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను క్రోడీకరించి తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.
అభ్యర్థులు సమర్పించిన ఆప్షన్ల ఆధారంగా 'మెరిట్ కమ్ ఆప్షన్' పద్ధతిలో వివిధ ఆలయాలకు కేటాయింపులు జరుపుతామని రామచంద్ర మోహన్ వివరించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులు, వివిధ ఆలయాలకు చెందిన సీనియర్ అర్చకులు పాల్గొన్నారు.




