Vijayawada: రెండో డిప్యూటీ మేయర్ పదవిని బీసీలకు కేటాయించాలి: బీసీ సంఘం!
Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేక జీవో ద్వారా రెండో డిప్యూటీ మేయర్ పదవిని ఏర్పాటు చేసి బీసీలకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
Vijayawada: రెండో డిప్యూటీ మేయర్ పదవిని బీసీలకు కేటాయించాలి: బీసీ సంఘం!
విజయవాడ నవంబర్ 24: రాష్ట్రంలో బీసీలు సుమారు 50 నుంచి 55 శాతం జనాభా కలిగి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం రాజకీయ పదవులు, అధికారంలో తగిన ప్రాధాన్యత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో కీలకమైన పదవులను అగ్రవర్ణాలకే కేటాయిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు 40 మంది బీసీ కార్పొరేటర్లు గెలుపొందినప్పటికీ, వారికి డిప్యూటీ మేయర్ పదవి కల్పించకపోవడం బీసీలను రాజకీయంగా విస్మరించడమేనని పేర్కొన్నారు.
మంగళవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర నాయకులు కనిశెట్టి లక్ష్మణరావు, ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీల ఓట్లను వినియోగించుకుంటూ, అధికార పదవులు కేటాయించే సమయంలో మాత్రం వారిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయ పదవుల్లో సముచిత వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ మేయర్ పదవితో పాటు డిప్యూటీ మేయర్ పదవిని కూడా అగ్రవర్ణాలకే కేటాయించడం బీసీల పట్ల వివక్షకు నిదర్శనమని విమర్శించారు. నగరంలో సుమారు 40 మంది బీసీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారిలో ఒక్కరికి కూడా డిప్యూటీ మేయర్ పదవి దక్కకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక జీవో విడుదల చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండో డిప్యూటీ మేయర్ పదవిని ఏర్పాటు చేసి ఆ పదవిని బీసీ వర్గాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
దుర్గగుడి చైర్మన్ పదవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్ర అభివృద్ధి కమిటీ వంటి కీలక పదవుల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.
విజయవాడలోని అన్ని బీసీ కులాలు, బీసీ సంఘాలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు స్పందించి తమ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్య నాగేశ్వరరావు నూకాలమ్మ తదితరుల ఆదేశాల మేరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
రెండో డిప్యూటీ మేయర్ పదవిని బీసీలకు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ధర్నాలు కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నిరాహార దీక్షలకు సైతం సిద్ధమని స్పష్టం చేశారు. బీసీలకు గౌరవం, గుర్తింపు, రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నమ్మి అప్పారావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సత్యాల సతీష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి అడ్వకేట్ పిల్లా శ్రీనివాసరావు, విజయవాడ యువజన విభాగం అధ్యక్షుడు పిసా అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ తమ్మినేని దుర్గారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, విజయవాడ వర్కింగ్ ప్రెసిడెంట్ బాడిశ రూపేష్, బాడిశ సాంబశివరావు, సగురుపిళ్ల శ్రీకాంత్, కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




