Vijayawada: విఎంసి నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు ఆగ్రహం

Vijayawada: విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టాలని డిమాండ్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 24 Sept 2026 10:58 PM IST
Vijayawada
X

Vijayawada: విఎంసి నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు ఆగ్రహం

విజయవాడ: బెజవాడ నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని, నగర పాలక సంస్థ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జ్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం ఆయన నాయకులతో కలసి న్యూ రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు ప్రాంతం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపై నిలిచిపోయిన మురుగునీరు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, నగరంలో వర్షపు నీరు సులువుగా పోయేందుకు సైడ్ డ్రెయిన్లను, డ్రైనేజీ కాలువలను ముందస్తుగా పూడికతీత తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ సైడ్ డ్రెయిన్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగర అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, నిధుల కొరతతో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని ఆరోపించారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, తద్వారా సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. స్థానిక ప్రజలు రోగాల బారిన పడకుండా నగర పాలక సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నగర ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బుడమేరు ఆధునీకరణ పనుల కోసం రూ.500 కోట్లు మంజూరు అయ్యా అని చెప్పిన మీరు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో విజయవాడకు వరద ముప్పు లేకుండా ఉండాలంటే రూ.500 కోట్లతో బుడమేరు ఆధునీకరణ, విస్తరణ, రక్షణ గోడల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేయాలన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో రూ.50,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు హడావుడి చేసిందని, అందులో విజయవాడ నగర అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలు స్వస్తి చెప్పి, బెజవాడ నగర డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వరమే నిధులు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గతంలో డయేరియా విజృంభించినా పాఠాలు నేర్వని నగర పాలక సంస్థ గతంలో న్యూ రాజేశ్వరి పేట ప్రాంతంలో డయేరియా తీవ్రస్థాయిలో విజృంభించి, పారిశుధ్య లోపం వల్ల ఇక్కడి ప్రజలు ఆసుపత్రుల పాలై తీవ్ర భయాందోళనలకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. అంతటి చేదు అనుభవాలు ఎదురైనా నగర పాలక సంస్థ అధికారులు ఏమాత్రం పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమన్నారు. డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన చేయకపోవడం, సైడ్ డ్రెయిన్ల పూడిక తీయకపోవడంతో మంచినీటి కాలువల్లోకి మురుగునీరు చేరి మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగర అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి లేదని, నిధుల కొరతతో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా పడకేసిందని విమర్శించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయని, వెంటనే స్పందించకపోతే సీజనల్ వ్యాధులు, డయేరియా వంటి మహమ్మారులు మళ్లీ చెలరేగే అవకాశం ఉందన్నారు.

హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సహాయం అందించాలని, పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. * నగరంలో అధ్వానంగా పారిశుధ్యం మరోవైపు నగరంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా పడకేసిందని మల్లాది విష్ణు విమర్శించారు. సూర్యారావుపేట, ఏలూరు రోడ్డు, ప్రకాష్ నగర్‌తో పాటు నగరంలోని దాదాపు అన్ని డివిజన్లలో మురుగునీరు నిలిచిపోయి రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్నారు.

చిన్నపాటి వర్షం కురిసినా రహదారులు చెరువులను తలపిస్తున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని, అలాగే అర్హులైన ప్రతి బుడమేరు బాధితుడికీ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాళ్ల ఆదినారాయణ, పఠాన్ నజీర్ ఖాన్, పేరూరి ప్రేమ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, చెన్న రెడ్డి , కృష్ణారెడ్డి ,కాళ్ళ శ్రీను, మీసాల సత్యనారాయణ పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.