Vijayawada: ఇంద్రకీలాద్రిపై 18.29 లక్షల మందికి అమ్మవారి దర్శనం: ఈవో!
Vijayawada: ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 18.29 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ వెల్లడించారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై 18.29 లక్షల మందికి అమ్మవారి దర్శనం: ఈవో!
విజయవాడ22 అక్టోబర్ 2026: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల అనంతరం ఇంద్రకీలాద్రి పరిసరాలు, విజయవాడ వన్ టౌన్ ప్రాంతం అరుణవర్ణ శోభతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో కీర్తించినట్లుగా, జగన్మాతకు అత్యంత ప్రీతిపాత్రమైన అరుణ వర్ణ (ఎరుపు రంగు) వస్త్రాలను ధరించి భవానీ దీక్షలతో తరలివచ్చిన భక్తజన ప్రవాహంతో క్షేత్రమంతా ఎరుపెక్కింది. గత రెండు రోజులుగా ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన భవానీ భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి 'జై భవానీ.. జై జై భవానీ' నామస్మరణతో మార్మోగిపోతోంది.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ గురువారం సాయంత్రం అధికారికంగా వివరాలు వెల్లడించారు. రికార్డు స్థాయిలో దర్శనాలు: దసరా ఉత్సవాల్లో అక్టోబర్ 11 నుండి 20వ తేదీ అర్ధరాత్రి వరకు దాదాపు 14,84,000 మంది (దాదాపు 15 లక్షల మంది) భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అనంతరం 21 మరియు 22 తేదీల్లో భవానీ భక్తులు నిరంతరాయంగా తరలివచ్చారు. దీంతో గురువారం సాయంత్రం 4 వరకు మొత్తం 18,29,000 మంది భక్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముంది. శుక్రవారం విరమణ చేయని భక్తులు మిగిలి ఉంటే శని, ఆదివారాల్లో దర్శనాలు పూర్తి చేసుకుంటారని అంచనా వేస్తున్నాము.
లడ్డూ ప్రసాదం నిల్వలు: ఈరోజు సాయంత్రం 4 వరకు భక్తులకు ఇప్పటివరకు 39,84,000 లడ్డూ ప్రసాదాలను విజయవంతంగా అందించడం జరిగింది. భక్తుల కోసం ఆలయ పోటు విభాగంలో ఇంకా 3,30,000 లడ్డూలు నికరంగా సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి.
అన్నప్రసాదం & ఆహార ప్యాకెట్ల వితరణ: ఇప్పటివరకు మొత్తం 8,37,385 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశాము. అన్నప్రసాద భవనంలో రాత్రి 12:00 గంటల వరకు భోజనాలు వడ్డిస్తుండగా, అర్ధరాత్రి 1:00 గంట నుండి వేకువజామున 4:00 - 5:00 గంటల వరకు హోల్డింగ్ ఏరియాల్లోని భక్తులకు ప్రత్యేకంగా ఫుడ్ ప్యాకెట్లు అందజేస్తున్నాము. అన్నప్రసాద భవనమే కాకుండా.. వినాయక గుడి ప్రారంభ పాయింట్, కేశఖండనశాల వద్ద గల అండర్‌పాస్, కొండపైన ప్రోటోకాల్ కార్యాలయం సమీపంలోని మూడు కేంద్రాల ద్వారా నిరంతరం ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము.
మజ్జిగ, బిస్కెట్లు & తాగునీరు: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు 4,34,000 మందికి బటర్‌మిల్క్ (మజ్జిగ), 6,45,000 బిస్కెట్ ప్యాకెట్లను క్యూలైన్లలో అందజేశాము. క్యూలైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు సురక్షిత తాగునీరు అందిస్తున్నాము.
వైద్య సేవలు (ఓపీ): కొండపై ఏర్పాటు చేసిన 5 పడకల ఆసుపత్రి/వైద్య శిబిరాల్లో ఇప్పటివరకు సుమారు 1,06,000 మంది భక్తులకు ఉచిత ఓపీ వైద్య సేవలు, అత్యవసర మందులు అందించడం జరిగింది. ప్రధానంగా కాళ్ల నొప్పులు, జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో వచ్చిన వారికి ఉపశమనం కల్పించాము.
సమన్వయం & మైక్ అనౌన్స్మెంట్లు: వినాయక గుడి, టోల్గేట్, ఓం టర్నింగ్, అమ్మవారి ప్రధానాలయం నుండి శివాలయం వరకు ప్రతి హోల్డింగ్ ఏరియాలో భక్తులకు మైకుల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, మహానివేదన, హారతుల వేళలను తెలియజేస్తున్నాము. అలాగే భక్తులలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు 'ఓం శ్రీ కనకదుర్గాయై నమః' నామస్మరణను మైకుల ద్వారా నిరంతరం వినిపిస్తున్నాము.
దేవస్థాన ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో అంకితభావంతో పనిచేస్తూ, ఎంతటి రద్దీ ఉన్నప్పటికీ విచ్చేసిన భవానీ భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా సంతృప్తికర దర్శనం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో పేర్కొన్నారు.




