Indrakeeladri: విజయదశమి: రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

Indrakeeladri: విజయదశమి వేళ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున 2:30 నుంచే దర్శనాలు, సాయంత్రం తెప్పోత్సవం.

Satyanarayana, Vijayawada
Published on: 19 Oct 2026 7:44 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: విజయదశమి: రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

​ఇంద్రకీలాద్రి (విజయవాడ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు రోజైన విజయదశమి పర్వదిన ఏర్పాట్లపై ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు సకల భువనాల అధీశ్వరి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ కంటే ముందుగానే ఆలయం తెరవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించామని, తెల్లవారుజామున 2:30 నుండి 3:00 గంటల మధ్య నుంచే భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించబడుతుందని ఈవో శీనా నాయక్ తెలిపారు.

నవరాత్రుల సందర్భంగా యాగశాలలో శాస్త్రోక్తంగా సాగుతున్న హోమ క్రతువులు విజయదశమి నాడు ఉదయం 10:30 గంటలకు నిర్వహించే "మహా పూర్ణాహుతి"తో పరిసమాప్తమవుతాయి. అనంతరం మధ్యాహ్నం వేళ యధావిధిగా అమ్మవారికి మహానివేదన సమర్పించబడుతుంది.

​రేపు మధ్యాహ్నం 1:00 నుండి 2:00 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారు ఇంద్రకీలాద్రికి విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సాయంత్రం 3:45 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఆదిదంపతుల నగరోత్సవ ఊరేగింపు ప్రారంభమై కృష్ణా తీరానికి చేరుకుంటుంది. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల మధ్య పవిత్ర కృష్ణా నదీ జలాలలో విద్యుద్దీప శోభితమైన హంసవాహనంపై స్వామి, అమ్మవార్ల నయనానందకరమైన "దివ్య తెప్పోత్సవం" అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.

​ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ.. సాయంత్రం వేళ ఇంద్రకీలాద్రిపై పంచహారతులు సంప్రదాయబద్ధంగా యధావిధిగా నిర్వహించబడతాయన్నారు. కృష్ణా నదిలో తెప్పోత్సవం వైభవంగా పూర్తయిన పిమ్మట, ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరుగుతుందని, అక్కడ ప్రత్యేక పూజలు స్వీకరించిన అనంతరం తిరిగి కొండపైకి చేరుకుంటాయని వెల్లడించారు.

భక్తులందరూ ఈ ముగింపు వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో దర్శించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada