Vijayawada: ప్రభుత్వమే నేరుగా ఉత్సవ ఖర్చులు భరించాలని విజ్ఞప్తి!
Vijayawada: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వీహెచ్‌పీ కోనసీమ అధ్యక్షుడు అక్కిరెడ్డి విజ్ఞప్తి.
Vijayawada: ప్రభుత్వమే నేరుగా ఉత్సవ ఖర్చులు భరించాలని విజ్ఞప్తి!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి శరన్నవరాత్రులు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సనాతన ధర్మ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు.
గతంలో రాష్ట్ర పండుగగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు అదే గౌరవాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉత్సవాల సమయంలో విధులు నిర్వహించే ప్రభుత్వ శాఖలకు అమ్మవారి హుండీ ఆదాయం నుంచి చెల్లింపులు చేయకుండా, ప్రభుత్వం తన నిధుల నుంచే నేరుగా ఖర్చులు భరించాలని సూచించారు.
దేవాలయాల నుంచి ప్రభుత్వం సీజీఎఫ్ రూపంలో నిధులు వసూలు చేస్తున్నందున, ఉత్సవాల నిర్వహణ బాధ్యతలో భాగంగా ప్రభుత్వ శాఖలకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బంది విషయంలో ఆలయ పవిత్రత, హిందూ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి అర్జునవీధిలోని దుర్గమ్మ ఆలయ ముఖద్వారం వరకు ఉన్న రహదారిని ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల నుంచి విముక్తి చేసి భక్తులకు సౌకర్యవంతంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే హిందూ సమాజాన్ని సమీకరించి ఆలయ మార్గం పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
అలాగే దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను హిందూ సమాజం ముందు బహిర్గతం చేసి, భక్తుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం కోరారు. అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడుతూ, సనాతన ధర్మ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన జరగాలని ఆయన ఆకాంక్షించారు.




