Vijayawada: పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లకు బి-ఫారాలు అందజేసిన వెలంపల్లి

Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 31 నుంచి 58 డివిజన్ల వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బి-ఫారాలు పంపిణీ చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 20 Oct 2026 10:42 PM IST
Vijayawada
X

Vijayawada: పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లకు బి-ఫారాలు అందజేసిన వెలంపల్లి

Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర వైసిపి మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మరియు ఎమ్మెల్సీ రుహుల్లాలతో కలిసి 31 నుంచి 58 డివిజన్ల వరకు పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ అహర్నిశలు శ్రమించి తమ డివిజన్లలో ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గాలికొదిలేసి తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను విస్తృతంగా ప్రచారం చేయాలని, కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి, వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కులం, మతం, ప్రాంతం, రాజకీయం అనే తారతమ్యాలు చూడకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించారని వెలంపల్లి గుర్తుచేశారు. జగనన్న పాలనలో జరిగిన మంచిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని అభ్యర్థులకు సూచించారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.