Vijayawada: పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా భేటీ.. ఏపీలో రాజకీయ ప్రకంపనలు!

Vijayawada: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హఠాత్తుగా భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 25 Sept 2026 4:29 PM IST
Vijayawada
X

Vijayawada: పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా భేటీ.. ఏపీలో రాజకీయ ప్రకంపనలు!

విజయవాడ: కాపుల ఆరాధ్యదైవం, దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా హటాత్తుగా జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. వారి కలయికకు వేడి చర్చ జరుగుతోంది. కారణమేమిటన్న దానిపై, సోషల్ మీడియా వేదికగా వాడి వేడి చర్చ మొదలైంది

అందులో భాగంగా వంగవీటి రాధా జనసేనలో చేరుతున్నారా? సీట్ల సర్దుబాటులో భాగంగా, కీలకమైన బెజవాడ మేయర్ గా ఆయనను జనసేన ప్రకటిస్తుందా? ఒకవేళ ఆయన జన సేనలో చేరితే టీడీపీలో ఉన్న గౌరవం అక్కడ ఉంటుందా? లేక పవన్ కల్యాణ్ను మర్యాద పూర్వకంగా కలిశారా?.. అదే నిజమైతే మరి గతంలో ఎప్పుడూ ఆయన పవన్ను కలవలేదు కదా? అసలు రాధా తనకేం కావాలో చెప్పే అలవాటు-స్పష్టత ఉంటే టీడీపీనే ఆయనకు పెద్దపీట వేసేది కదా? అంత వ్యూహాత్మక రాజకీయాలు రాధాకు వంటబట్టాయా?

ఆయనకు అంత రాజకీయ చతురత -లౌక్యం ఉంటే తండ్రి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పేవారు కదా? అంటూ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయ చర్చకు తెరలేచింది.

ఉరుము లేని పిడుగులా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, జనసేనాని -డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్తో భేటీ కావడం చర్చనీయాంశమయింది. సహజంగా మిత్రులతో తప్ప, ఇలాంటి రాజకీయ భేటీలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వని రాధా, హటాత్తుగా పవన్ కల్యాణ్ను కలవడం వెనుక అంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

రాధాకు తనకు ఏం కావాలో తనకే తెలియదని.. అది ఏవిధంగా ఎదుటివారికి చెప్పాలో కూడా తెలియని బోళా మనిషన్న పేరుంది, నిజంగా తనకు ఏం కావాలో చెబితే, టీడీపీ నాయకత్వం దానిని ఎప్పుడో ఇచ్ఛేదన్న వ్యాఖ్యలూ లేకపోలేదు. రాధాకు అంత రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు తెలిసి ఉంటే ఆయన ఈపాటికి రాష్ట్రంలో కీలకశక్తిగా ఎప్పుడో ఆవిర్భవించేవారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యదర్శి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడయిన టిడీ జనార్దన్ రాయబారంతో, వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరారు. చేరారు. ఎన్నికల్లో ఆయన పర్యటనలను జనార్దనే సమన్వయం చేశారు. అంతకంటే ముందు.. ఒక ఐపిఎస్ అధికారి కూడా టీడీపీలో చేరేలా రాయబారం నడిపారు. ఆ ఎన్నికల్లో రాధాకు మచిలీపట్నం ఎంపి సీటును టీడీపీ ఆఫర్ చేసినా, ఆయన తిరస్కరించారన్న ప్రచారం లేకపోలేదు. ఆ రకంగా రాధా

పార్టీ ప్రచారానికే పరిమితమయ్యారు, "కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకు ఎమ్మెల్సీ లేదా, రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే రాధా మాత్రం.. తనకు ఫలానా పదవి కావాలంటూ, ఇప్పటివరకూ టీడీపీ నాయకత్వాన్ని కోరింది లేదని, అది ఆయన స్వభావానికి విరుద్ధమంటున్నారు. ఆయన రొటీన్ పాలిటిక్స్ చేయరని, రిజర్వుడుగానే ఉంటారని విశ్లేషిస్తున్నారు. తాజా కాపుల వివాద నేపథ్యంలో రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినా, ఆ కోటాలో జనసేన నుంచి నాగబాబు, టీడీపీ కోటాలో వర్ల రామయ్యకు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో రాధా జనసేనానిని కలవడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. ఆయన జనసేనలో చేరి, కీలకమైన మేయర్ పదవికి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలయింది. అయితే చికిత్స చేయించుకున్న పవన్ను పరామర్శించేందుకే, రాధా ఆయనను కలిలారన్న మరో వాదన వినిపించింది. అదే నిజమయితే, మరి పవన్ ముంబయి, హైదరాబాద్లో శ చికిత్స చేయించుకుని వచ్చినప్పుడు రాధా ఆయనను కలని పరామర్శించలేదు కదా? ఇప్పుడే ఎందుకు కలిశారు? అన్న ప్రశ్నలు వినిపించాయి.

మరికొందరు మాత్రం.. రాధా జనసేనలో చేరేందుకే, పవన్ కళ్యాణ్ను కలిశారన్న వాదనకు దిగారు. కానీ దానిని ఇంకొందరు త్రోసిపుచ్చారు. రాధాకు టీడీపీలో ఉన్న గౌరవం జనసేనలో ఉంటుందా? నిజంగా రాధా తనకేం కావాలో చెబితే టీడీపీ నాయకత్వం, దానిని ఎప్పుడో నెరవేర్చేది కదా? రాధా ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో బాగుంటున్నారు. టీడీపీలో ఉంటే ఇవాళ కాకపోతే రేపయినా కాపు నాయకుడిగా ఎదుగుతారు? జనసేనలో అలాంటి అవకాశం ఎందుకు ఉంటుంది? అలాంటప్పుడు జనసేనలో ఎందుకు చేరతారు? అన్న లా పాయింట్లు తీస్తున్నారు.

మరోవైపు.. వంగవీటి రాధాను చేర్చుకుంటే జనసేన రాజకీయంగా మరింత బలపడటంతోపాటు, కాపులకు పూర్తి స్థాయిలో చేరువవుతుందం టున్నారు, కమ్మ సామాజికవర్గానికి చెందిన లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇచ్చిన తర్వాత, ప్రస్తుతం కాపులు జనసేనపై అసంతృప్తిగా ఉన్నారు. అటు కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు పెత్తనం ఇవ్వడంపై కాపు నాయకులు ఏమీ అనలేక, చాలాకాలం నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో కాపు ఆరాధ్యదైవమయిన

రంగా తనయడు రాధాను జనసేనలో చేర్చుకుంటే, కాపుల్లో ఇక జనసేనకు తిరుగుండదన్న వ్యూహంతోనే ఆయనను జనసేనలో ఆహ్వానించి ఉండవచ్చన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

సహజంగా పవన్ కల్యాణ్ తనను కలిసేందుకు వచ్చిన వారెవరితోనూ, భుజంపై చేసి వేసి ఫొటోలు దిగరని గుర్తు చేస్తున్నారు. అలాంటిది వంగవీటి రాధా భుజంపై ఆప్యాయంగా చేయి వేసి ఫొటో దిగటం, దానిని మీడియాకు విడుదల చేయడం బట్టి తెరవెనక ఏదో జరుగుతోంది అని అంటున్నారు

నిజానికి వంగవీటి రాధాకు రంగా వారసత్వ ఇమేజ్ ఉందని, అయితే దానిని ఎలా వాడుకోవాలో రాధాకే తెలియడం లేదన్న వ్యాఖ్యలు, కాపు సంఘాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటుంది.

ఈవిధంగా సోషల్ మీడియాలో పవన్-రాధా కలయికపై చిత్ర విద్రిత వాదనలు వినిపిస్తున్నాయి. అటు రాధా సైతం తమ భేటీపై మీడియాకు ఎలాంటి వివరణ గానీ, ప్రకటన గానీ చేయకపోవడంతో ఈ ఉత్కంఠ కొనసాగేందుకు కారణమయింది.

రాధా సహజంగా మీడియాకు దూరంగా ఉండే నాయకుడు కావడంతో.. లోపల ఏం జరిగిందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఫలితంగా వారిద్దరి భేటీపై, సోషల్ మీడియా సైనికులు, కాపు సంఘాలు ఎవరి కోణంలో వారు చర్చకు తెరలేపినట్లు కనిపిస్తోంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.