Vijayawada: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక సందడి.. 100కు పైగా పోటీలు!
Vijayawada: విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిజ్ఞాస సాంస్కృతిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Vijayawada: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక సందడి.. 100కు పైగా పోటీలు!
విజయవాడ: ( తుమ్మలపల్లి కళాక్షేత్రం) సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిజ్ఞాస నిర్వహిస్తున్న సాంస్కృతిక, కళా పోటీలు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
జిజ్ఞాస ఆధ్వర్యంలో మొత్తం ఏడు విభాగాల్లో 100కు పైగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 6,000 మందికి పైగా పోటీల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని జిజ్ఞాస ప్రతినిధులు తెలిపారు. తొలి రోజు నుంచే చిన్నారులు, యువత, పెద్దలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ ద్వారా నగరంలోని కళా, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు జిజ్ఞాస నిర్వహిస్తున్న పోటీలు ఎంతో అభినందనీయమని అన్నారు. చిన్నారులు, యువత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌ను ప్రతి ఒక్కరూ తమ సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేశినేని ఫౌండేషన్ తరఫున కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మి మాట్లాడుతూ.. జిజ్ఞాస ద్వారా నిర్వహిస్తున్న పోటీలకు ఇంత భారీ స్పందన రావడం సంతోషకరమని అన్నారు. ఆన్‌లైన్‌లో ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకోవడం ద్వారా విజయవాడ ప్రజల్లో కళలు, సంస్కృతి పట్ల ఉన్న ఆసక్తి స్పష్టమవుతోందన్నారు. పిల్లలు, యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, పట్టాభి సతీమణి చందన, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రతినిధులు, జిజ్ఞాస టీం సభ్యులు, పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఉత్సవ్‌లో జిజ్ఞాస పోటీలు నగరంలోని కళా, సాంస్కృతిక ప్రతిభకు వేదికగా నిలుస్తుండటంతో తొలి రోజే తుమ్మలపల్లి కళాక్షేత్రం సందడిగా మారింది.




