Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలు.. శ్రీ ధనలక్ష్మీ పూజ, కవాట బంధనం

Indrakeeladri: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ప్రదోష కాలంలో ధనలక్ష్మీ పూజలు. కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించిన ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ.

Satyanarayana, Vijayawada
Published on: 8 Nov 2026 8:32 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలు.. శ్రీ ధనలక్ష్మీ పూజ, కవాట బంధనం

​ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రదోష కాలంలో ప్రత్యేక పూజా కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దీపావళి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో, ఉపాలయాల్లో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి పూజలలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయంలో వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా "శ్రీ ధనలక్ష్మీ పూజ"ను విశేషంగా నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల ఆనవాయితీ ప్రకారం బాణాసంచా వెలిగించి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తిప్రపత్తులతో జయజయధ్వానాలు చేశారు.

​దీపావళి పూజాదికాలు పూర్తయిన పిమ్మట, ఆలయ వైదిక ఆచారాల ప్రకారం వేద మంత్రోచ్ఛారణల నడుమ రాత్రి శాస్త్రోక్తంగా ఆలయ కవాట బంధనం (ద్వారాల మూసివేత) కార్యక్రమం నిర్వహించబడింది.

​ఈ విశేష దీపావళి మహోత్సవంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి గూడపాటి సరోజినీ దేవి, స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు శ్రీ ఎల్. దుర్గా ప్రసాద్, ముఖ్య అర్చకులు శ్రీ ఆర్. శ్రీనివాసశాస్త్రి మరియు దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada