Indrakeeladri: భక్తుల సేవలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేయాలి
Indrakeeladri: ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన సిబ్బందికి 18 మార్గదర్శకాలు జారీ చేసిన ఈవో వి.కె. శీనా నాయక్; పారదర్శకత, క్రమశిక్షణపై ఆదేశాలు.
Indrakeeladri: భక్తుల సేవలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేయాలి
ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సేవలు అందించడం మరియు విధి నిర్వహణలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి మహామండపం 4వ అంతస్తు సమావేశం హాల్‌లో దేవస్థానం సిబ్బందితో కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముందుగా అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్. రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు, డాక్టర్ కె. గంగాధర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో సిబ్బంది అనుసరించాల్సిన నియమ నిబంధనలపై పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ సిబ్బందికి 18 ప్రధాన మార్గదర్శకాలతో కూడిన దిశానిర్దేశం చేశారు.
జన్మ జన్మల పుణ్యఫలంగా అమ్మవారి సన్నిధి లో సేవ చేసే అవకాశం లభించిన ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా యూనిఫాం, గుర్తింపు కార్డు ధరించాలని, ఆలయ పవిత్రతకు అనుగుణంగా తిలకధారణతో సహా సంప్రదాయాలను పాటిస్తూ సమయపాలనతో విధులకు హాజరుకావాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడం లేదా విధులకు గైర్హాజరు కావడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
టికెట్ల జారీ, ప్రసాద విక్రయాలు, విరాళాల కౌంటర్లలో పనిచేసే సిబ్బంది తమ వ్యక్తిగత నగదును లేదా అదనపు సొమ్మును కౌంటర్ల వద్ద ఉంచుకోరాదని, ప్రతి లావాదేవీకి రశీదు జారీ చేయాలని ఆదేశించారు. నగదు కౌంటర్లు, ప్రసాద నిల్వ ప్రాంతాలు, కానుకల స్వీకరణ కేంద్రాలలో అనధికార వ్యక్తులకు ప్రవేశం కల్పించరాదని, నగదు చెల్లింపు రిజిస్టర్లను అధికారుల ధృవీకరణతో సక్రమంగా జమ చేయాలని సూచించారు.
ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుని పట్ల గౌరవం, సహనంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. భక్తుల నుండి ఎటువంటి అదనపు వసూళ్లకు పాల్పడరాదని, విధి నిర్వహణ సమయంలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగానికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
దేవస్థానంలో పనిచేయడం కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాకుండా, అమ్మవారి సేవగా భావించి భక్తి, నిజాయితీ, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని ఈవో పేర్కొన్నారు. భక్తుల సేవ లో ఆలయయంత్రాంగం ఇచ్చిన సూచనలను ఉల్లంఘించినా, విధులలో నిర్లక్ష్యం లేదా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించినా ఎటువంటి ఉపేక్ష లేకుండా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




