Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా సహస్ర లింగార్చన, దీపాలంకరణ!
Indrakeeladri: ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం సాయంత్రం సహస్ర లింగార్చన, దీపాలంకరణ, ఊయల సేవ వైభవంగా జరిగాయి.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా సహస్ర లింగార్చన, దీపాలంకరణ!
ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పవిత్ర కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ మరియు ఊయల సేవ కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ స్థానాచార్యులు శ్రీ శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక బృందం శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ విశేష పూజా క్రతువులను నిర్వహించారు.
పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే సహస్ర లింగార్చనలో పాల్గొని ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు నశించి, సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వేయి లింగాలకు ఏకకాలంలో జరిగే ఈ విశేష అర్చన ద్వారా భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకస్వాములు తెలిపారు.
ఈ దివ్య పూజా కార్యక్రమాలలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. సహస్ర దీపాల కాంతుల నడుమ సాగిన అర్చన మరియు అనంతరం జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఊయల సేవ భక్తులకు కనువిందు చేశాయి. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలను అందజేశారు.
ఈ విశేష కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాఘవరాజు, శ్రీ ఎ. శ్రీనివాసరావు, శ్రీమతి సరిత, శ్రీమతి పద్మావతి ఠాకూర్, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వి. శంకర బాబు తదితరులు పాల్గొన్నారు.




