Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల స్వర్ణ కిరీటం బహూకరణ!
Vijayawada: విజయవాడ దుర్గమ్మకు శ్రీకాకుళం భక్తుడు దుర్గా శ్రీనివాస్ దసరా నవరాత్రుల వేళ రూ. 75 లక్షల విలువైన 494 గ్రాముల స్వర్ణ కిరీటం సమర్పించారు.
Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మకు రూ. 75 లక్షల స్వర్ణ కిరీటం బహూకరణ!
Vijayawada: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి గురువారం ఉదయం విశేష స్వర్ణ కానుక సమకూరింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన భక్తులు శ్రీ కూర్మినాయుడు, శ్రీమతి పద్మావతమ్మ దంపతుల కుమారుడు శ్రీ కె. దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి సుమారు రూ. 75 లక్షల విలువైన దివ్య స్వర్ణ కిరీటాన్ని భక్తిప్రపత్తులతో సమర్పించారు.
ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన 494 గ్రాముల బరువు గల ఈ నవరత్న ఖచిత బంగారు కిరీటాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారివి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా, అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా దాత శ్రీ కె. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ.. లోకపావని అయిన కనకదుర్గమ్మ దయవల్లే తాము ఈ కానుకను సమర్పించుకోగలిగామని, పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల పర్వదినాల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహూకరించే భాగ్యం కల్పించినందుకు ఆలయ ఈవోగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.




