Vijayawada: కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీపీఎం పిలుపు

Vijayawada: ప్రజలపై పన్నుల భారం మోపుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కూటమికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని విజయవాడ సీపీఎం విస్తృత సమావేశం పిలుపునిచ్చింది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 26 Sept 2026 3:30 PM IST
Vijayawada
X

Vijayawada: కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీపీఎం పిలుపు

Vijayawada: ప్రజలపై పన్నుల భారాలు మోపి, అభివృద్ధిని కుంటుపరుస్తూ, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కూటమి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పండి.

విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, పాత నగరంగా మారుస్తున్న కూటమి సర్కార్ ను నిలదీయండి.

నగర పాలక సంస్థలో పదేళ్లు పన్నులు లేని ఆదర్శ పాలన అందించి, ప్రతిపక్షంగా ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు పోరు సాగించిన కమ్యూనిస్టులు, సిపిఎంకు అండగా నిలవండి.

ధన రాజకీయాల నేపథ్యంలో.. నగర అభివృద్ధి .. ప్రత్యామ్నాయ విధానాల కోసం.. స్థానిక ఎన్నికలలో.. కమ్యూనిస్టులు, అభ్యుదయ,లౌకిక శక్తులు, వ్యక్తులు ఏకం కావాలి,ఉమ్మడి పోరు సాగించాలి.

సిపిఎం విజయవాడ నగర విస్తృత సమావేశం సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాబూరావు, డి.వి.కృష్ణ, కాశీనాథ్ మాట్లాడుతూ...

రాబోయే ఎన్నికలలో.. నగరాన్ని, రాష్ట్రంలో పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలపై పన్నుల భారాలు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓటుతో నిరసన తెలపండి.

ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై గళం విప్పాలి.

అధికారాలను కేంద్రీకృతం చేస్తూ.. స్థానిక సంస్థలను దెబ్బతీస్తున్న కేంద్ర,రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలకు స్థానిక ఎన్నికలలో గుణపాఠం చెప్పాలి.

ఎన్నికల కమిషన్ ని పావుగా వాడుకుంటూ.. ప్రజల ఓటు హక్కును హరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నిలదీయాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్రానికి మద్దతునిస్తున్న పార్టీలు కళ్ళు తెరవాలి.

విజయవాడ నగరంలో పాలక పార్టీలు నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. నిధులు ఇవ్వకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఆఖరికి జి.ఓ 673 తీసుకువచ్చి నగరాలను అమ్మకానికి పెట్టారు.

విజయవాడ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు పాలించిన పార్టీలు నగరాన్ని అధోగతి పాలు చేశాయి.

విజయవాడ నగరంలో పదేళ్లు వామపక్షాలు ఆదర్శపాలన అందించాయి. పన్నుల భారాలు లేకుండా నగర సమగ్రాభివృద్ధికి కృషి చేశాయి. ప్రతిపక్షంగానూ ప్రజా వాణిని వినిపించాయి.

నగరాభివృద్ధిని కోరుకునే అభ్యుదయ, లౌకిక శక్తులు, వామపక్షాలు రాబోయే ఎన్నికల్లో అన్ని వార్డులలోను, మేయర్ స్థానానికి ఉమ్మడి కృషి చేయాలని.. ఇందుకోసం పార్టీ శ్రేణులు, అభిమానులు పూనుకోవాలని సమావేశం పిలుపునిచ్చింది.

అమరావతితో సమాంతరంగా.. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. 11 వేల కోట్లతో పట్టణాలలో అభివృద్ధి పనులు ప్రకటించి,అందులో నగరానికి కనీసం 100 కోట్లు కూడా కేటాయించలేదు.

ఇళ్ళ పట్టాల సమస్య నగరంలో తీవ్రంగా ఉన్నది. సుమారు లక్ష కుటుంబాలు పట్టాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా కరకట్ట, కాలువ కట్టలు, కొండ ప్రాంత పట్టాలు అర్జీలు పెట్టుకున్న అందరికీ పట్టాలు ఇవ్వాలి.

బుడమేరు వరదల నేపథ్యంలో ముంపు నివారణ చర్యలు చేపట్టి అభివృద్ధి చేస్తామన్నారు. మాటలకే పరిమితం అయ్యారు. వర్షాలు పడితే నగర ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.

జి.ఓ నెం.673 తీసుకువచ్చి నగరంలో ఉన్న కీలకమైన ,విలువైన స్థలాలను కార్పోరేట్ సంస్థలకు అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటికే భవాని ద్వీపం 130 ఎకరాలను లీజుకు ఇచ్చారు.

ఆస్తిపన్ను పెంచబోమని, సమీక్ష జరుపుతామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ప్రతి ఏటా ఆస్తిపన్ను పెంచుతున్నారు. ఇప్పటికే ఆరేళ్లలో 130% పైగా ఆస్తిపన్ను పెరిగింది. దొడ్డి దారిన మరలా చెత్త పన్ను వేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ధనార్జనే ప్రధాన కర్తవ్యంగా పదవులను వాడుకుంటున్నారు. వారికున్న పదవులు సరిపోనట్లు వారి కుంటుబ సభ్యులకు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

సిపిఎం,వామపక్షాలు పదేళ్ల నగర పాలనలో.. పన్నుల భారాలు లేకుండానే అభివృద్ధి చేసింది. బూస్టర్ల ద్వారా కొండలపైకి నీళ్లు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు నిర్మించడం స్టేడియాలు, పార్కులు ఏర్పాటు అభివృద్ధి చేసింది.

ప్రజా సమస్యలపై నికరంగా పని చేస్తున్న సీపీఎం, వామపక్షాలకు ప్రజలు అండగా నిలవాలి. డబ్బు, కుల, మత రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా, ప్రజల కొరకు పనిచేస్తున్న వారిని ఆదరించండి.

ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ కార్యదర్శి బి.సత్యబాబు, సెంట్రల్ కార్యదర్శి బి.రమణారావు, తూర్పు కార్యదర్శి పి.కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు దుర్గారావు, నారాయణ, క్రాంతి, ప్రవీణ్ పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.