Vijayawada: విజయ డైరీ వద్ద సీపీఎం ఆందోళన పెంచిన పాల ధరలు తగ్గించాలి!
Vijayawada: విజయ డైరీ నూతన చైర్మన్ పదవీస్వీకార కార్యక్రమం వద్ద పెంచిన పాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన, ఉద్రిక్తత.
Vijayawada: విజయ డైరీ వద్ద సీపీఎం ఆందోళన పెంచిన పాల ధరలు తగ్గించాలి!
Vijayawada: వినాయక చవితి పండగ రోజు నుండే( సెప్టెంబర్ 14వ తేదీ) పెంచిన విజయ పాల ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్టు వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. నూతన చైర్మన్ గా దాసరి బాలవర్ధన రావు పదవి స్వీకారం చేస్తున్న తరుణంలో ప్రజల గోడును తెలుపుతూ, సిపిఎం నేడు ధర్నా నిర్వహించింది.
గత పది రోజుల నుండి సిపిఎం, ఇతర అనేక ప్రజాసంఘాలు నగరంలోను, జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో పెరిగిన పాల ధరలపై ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినా పాలకమండలి, అధికారులు, ప్రభుత్వం ప్రజాప్రతినిధుల నుండి స్పందన కరువు అవటంతో సిపిఎం ఆందోళన ఉదృతం చేసింది. తొలుత ప్రధాన గేటు వద్ద సిపిఎం కార్యకర్తలు, మహిళలు ...బ్యానర్లు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన సాగించారు, నిరసన తెలిపారు.
చైర్మన్ కు వినతిపత్రం సమర్పించడానికి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అనుమతి ఇవ్వకుండా, అడ్డుకోవటంతో కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది నిరసనకారులపై దురుసుగా ప్రవర్తించారు, దీనితో తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది.
ఎట్టకేలకు మిల్క్ యూనియన్ ఎండి తో సహా పలువురు అధికారులు, నేతలు వచ్చి నేతలు కార్యకర్తలకు సర్ది చెప్పారు, సెక్యూరిటీ అధికారులు తమ దురుసు ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు సిపిఎం నేతలు.. అభినందనలు తెలిపి, వినతిపత్రం సమర్పించారు. తక్షణమే బోర్డు సమావేశమై.. పెంచిన ధరలు పూర్తిగా రద్దు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా బాబురావు, ఇతర నేతలు మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితుల మధ్య, వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ స్థితిలో విజయ డైరీ పాల ధరలు పెంచడం గర్హనీయం. ధరలు పెంచితే సహించబోమని ఒకవైపున ముఖ్యమంత్రి ప్రకటిస్తుండగా ప్రభుత్వం ఆధ్వర్యంలో, తెలుగుదేశం కూటమి నేతృత్వంలో సాగుతున్న విజయ డైరీ యాజమాన్యం పాల ధరలను పెంచడం దుర్మార్గం.
బియ్యం మొదలు అన్ని నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి సామాన్యులు, మధ్యతరగతి సతమతమవుతున్నారు నిత్యవసరాలను చౌక డిపోలు, రైతు బజార్ల ద్వారా తక్కువ రేట్లకి అందిస్తామని ఒకవైపున ప్రకటిస్తూ మరోవైపు పాల ధరలను కూటమి నేతలు, పాలకవర్గం పెంచడం శోచనీయం.
ఏప్రిల్ లో పాల ధరలు పెంచి ఐదు నెలలు కాకముందే మరోసారి పెంచడం సరికాదు. సంవత్సరములో మూడు సార్లు పాలధరలు పెంచడం వల్ల వినియోగదారులపై 200 కోట్ల రూ పైన భారం పడుతుంది. విజయ డైరీ పాల ధరలు పెంచి.. ప్రైవేటు డైరీలు ధరల పెంచడానికి దారి చూపిస్తున్నది.
పిల్లలు, వృద్దులు, గర్భిణీ స్త్రీలు, ప్రజలందరికీ నిత్యవసరం, అత్యవసరమైన పాల ధరలను సైతం వదిలిపెట్టకుండా పెంచడం క్షంతవ్యం కాదు. విజయ డైరీ పదవుల పంపకంలో చురుకైన పాత్ర వహించిన కూటమి అధిష్టానం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల ధర పెంపుపై స్పందించకపోవడం దారుణం. పదవుల పంపకాలు తప్ప.. ప్రజల గోడు కూటమి నేతలకు, ప్రజా ప్రతినిధులకు పట్టదా?
రైతులకు పాల సేకరణకు సరైన ధర, వినియోగదారులకు సరసమైన ధరలకు పాలు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
పాల సహకార సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి, పాల ధరలను అదుపు చేయాలి. .బడా కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా భూములు, రాయితీలు, పన్నుల తగ్గింపు, సబ్సిడీలు, రుణాలు అందిస్తున్న ప్రభుత్వం. పౌష్టికాహారమైన పాలు అందించే సహకార సంఘాలకు ఎందుకు మొండి చేయి చూపిస్తున్నది? తోడ్పాటు ఎందుకు ఇవ్వటం లేదు?
పాలక వర్గంలో ఆదిపత్యం, పెత్తనం కోసం ...ఆగ మేఘాల మీద స్పందించిన ప్రభుత్వ పెద్దలు.. పాల ధర పెంపుపై మౌనం వహించడం తగదు. వినియోగ దారులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సంప్రదించకుండా అడ్డగోలుగా, ఏకపక్షంగా, ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పాలధరలను పెంచడం సమంజసం కాదు.
పాల ధరలు తగ్గించకపోతే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచిన పాల ధరలు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల అంశాలను ప్రధాన ఎజెండాగా మార్చుతాం. పాలధర పెంపుకు ముఖ్యమంత్రి ,కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని.. పెంచిన పాల ధరలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి. జిల్లాలోనూ, నగరములోనూ ఉన్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పాలధర పెంపుపై మౌనం వహించడం భావ్యం కాదు.
ఇప్పటికైనా పెదవి విప్పాలి,స్థానిక ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీల గురించి ఆలోచిస్తున్న నేతలు ప్రజల గురించి, పెరిగిన ధరల గురించి ఆలోచిస్తే మేలు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది, ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారు.
నేడు జరిగిన ఈ ఆందోళనలో సిపిఎం నేతలు బోయి సత్యబాబు, బి రమణ రావు ,పి కృష్ణ, ఈవి. నారాయణ, కే.సరోజ, ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.




